కవిత కస్టడీ పొడిగింపు: విచారణకు సహకరించటం లేదన్న ఈడీ; కవిత సంచలన వ్యాఖ్యలు!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై గత వారంరోజులుగా ఈడి కస్టడీలో విచారణని ఎదుర్కొన్న కవితకు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టిన ఈడీఅధికారులు, ఈ కేసులో కవిత విచారణకు సహకరించటంలేదని, మరో ఐదురోజుల కస్టడీ కావాలని, తనను ఏది అడిగిన వివరాలు ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ట్రయల్ కోర్టు కవితకు మరో మూడురోజులు ఈడీ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
కవితను కోర్టులో హాజరు పరచడానికి తీసుకువెళుతున్న క్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఈడీ అధికారులు అడిగిన వివరాలను మళ్లీమళ్లీ అడుగుతున్నారని, తనపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈడీ విచారణలో కొత్త అంశం ఏమీ లేదన్నారు.

ఇక రౌస్ అవన్నీ కోర్టులో ఈరోజు వాదనల విషయానికి వస్తే.. ఈడీ తరఫున న్యాయవాది జోయాబ్ హుస్సేన్ వాదిస్తూ కవిత ఈడి విచారణకు సహకరించడం లేదని, నలుగురి స్టేట్మెంట్స్ గురించి కవితను అడిగామని అయినా చెప్పడం లేదన్నారు. కిక్ బ్యాగ్స్ గురించి అడిగామని, డిలీట్ చేసిన ఫోన్ల డేటా గురించి అడిగామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కుటుంబ ఆదాయపన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని ఏ ఒక్కటి కవిత ఇవ్వలేదని పేర్కొన్నారు.
కవిత కస్టడీ పొడిగింపు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..!!#Kavitha #KavithaArrested #KavithaKalvakuntla #DelhiLiquorScam #DelhiLiquorPolicyScam #DelhiExcisePolicyCase #RouseAvenueCourt #Oneindiatelugu pic.twitter.com/NPi28wZFvh
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2024
రేఖ శరణ్ కు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని, అలాగే సమీర్ మహేంద్రు కూడా కవిత బినామీనేనని, కవితతో కలిపి సమీర్ మహేంద్రుని కూడా విచారించాలని అన్నారు. లిక్కర్ స్కామ్ లో వందల కోట్లు చేతులు మారాయని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచనల మేరకు కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు.
ఇక కవిత తరపు వాదించిన న్యాయవాది ఈడి కస్టడీలో ఉన్న కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని వాదించారు. కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె ఆరోగ్య పరిస్థితిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు కవిత పిల్లలు చిన్నవారని, వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని, కస్టడీ పూర్తయిన రోజే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మరో మూడు రోజులు కవిత కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications