కవిత కొత్త పార్టీ.. 'సర్వోదయ తెలంగాణ సాధన'?
తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై మరో రాజకీయ శక్తి ఉద్భవించబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన సొంత రాజకీయ పార్టీ గురించి కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. 'సర్వోదయ తెలంగాణ' సాధనే ధ్యేయంగా ఈ కొత్త ప్రయాణం మొదలవుతుందని ఆమె స్పష్టం చేశారు.
వచ్చే ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని 'అధ్వయ కన్వెన్షన్‌లో' జరగబోయే భారీ బహిరంగ సభలో పార్టీ పేరును, జెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. ఆ రోజు అత్యంత బలమైన ముహూర్తం ఉందని, ఆ వేదిక నుంచే రాబోయే రాజకీయ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు.

నీళ్లు, నిధులు, నియామకాలే అజెండా!
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు దాటినా, మనం ఆశించిన 'నీళ్లు, నిధులు, నియామకాలు' సంపూర్ణంగా సాకారం కాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిపాలన తీరుపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి ఇప్పుడు ఒక బలమైన రాజకీయ శక్తి అవసరమని ఆమె నొక్కి చెప్పారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకే ఈ పార్టీ అవతరిస్తుందని వివరించారు.
మహిళల నాయకత్వంలో సరికొత్త ప్రయోగం
ఈ కొత్త పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు కవిత ప్రకటించారు. "ఇన్నాళ్లూ పురుషులు స్థాపించిన పార్టీలను చూశారు. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏప్రిల్ 25న మునీరాబాద్ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications