నేడు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత... కేసీఆర్ తనయకు పెద్ద కష్టమే!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి గత ఆరు రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు తన అరెస్ట్ అక్రమమని ఏ కోర్టుకు వెళ్లినా ఊరట దొరకలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిబంధనలు పాటించకుండా తనను అరెస్టు చేశారని, తన అరెస్టును కోర్టులో సవాలు చేసిన కవితకు అటు రౌస్ అవెన్యూ కోర్టులోనూ, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది.
నేటితో కవిత వారం రోజుల కస్టడీ పూర్తి కానుండగా ఈడి అధికారులు మళ్లీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈనెల 15వ తేదీన అరెస్టయిన కవితను 16వ తేదీన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ విధించి, వారం రోజులు కవితను ఈడి కస్టడీకి అనుమతించింది.

ఈ కేసులో ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలన్న కారణంగా కవిత కస్టడీ కోరిన ఈడీ అధికారులు గత ఆరు రోజులుగా విచారణను సాగించారు. ఏడవ రోజు నేడు కూడా విచారణ పూర్తి చేసి మధ్యాహ్నం 12గంటల లోపు మళ్ళీ కోర్టులో కవితను హాజరు పరచనున్నారు. గత వారం రోజులుగా కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆమెను విచారించినట్లు సమాచారం.
అంతేకాదు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుటుంబసభ్యులతో భేటీ అయ్యేందుకు కూడా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో కవిత తన కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. నిన్న కవిత తన కుమారుడు ఆర్య, సోదరి అఖిల. స్నేహితురాలు వినుత తో కలిసి మాట్లాడారు. తన కుటుంబసభ్యులకు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్టు సమాచారం. తన కుమారుడికి ముఖ్యంగా ధైర్యంగా ఉండాలని కవిత సూచించారు.
అయితే నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పరచనున్న ఈడీ అధికారులు మళ్లీ కవితను కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టవలసి ఉన్నందున కవిత కస్టడీ పొడిగించమని ఈడి అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మరోవైపు కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన నేపథ్యంలో కవిత బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో మళ్లీ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ఈడీ విచారణ నుంచి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుండి కెసిఆర్ తనయ కవితకు ఇప్పట్లో ఊరట దొరికేటట్టు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications