
సీబీఐ నోటీసులపై కవిత యూటర్న్; నేడు వివరణకు నో.. కేసీఆర్ తో కీలకభేటీలో జరిగిందిదేనా?
ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిబిఐ జారీచేసిన నోటీసులపై యూటర్న్ తీసుకున్నారా? మొదట 6 వ తేదీన తన ఇంట్లో అందుబాటులో ఉంటాను అంటూ సిబిఐకి సమాధానం ఇచ్చిన కవిత ఆపై తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? సీఎం కేసీఆర్ తో భేటీ తర్వాత కవిత నిర్ణయంలో మార్పు వచ్చిందా? అంటే అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల నుండి వస్తుంది.

సీబీఐ నోటీసులకు ముందు వివరణ ఇస్తానన్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో చిక్కుకున్నారు. ఇక ఇందులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆమెకు సీబీఐ అధికారులు అవసరమైన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కాని తమతో మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరారు. దీంతో మొదట ఆరవ తేదీన తన ఇంట్లో అందుబాటులో ఉంటానని, ఉదయం 11 గంటలకు రావచ్చని, సిబిఐ అధికారులు తనతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు కవిత.

ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ తర్వాత మారిన కవిత ప్లాన్
ఆపై సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో కవిత సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ సీబీఐ కి వివరణ ఇవ్వటం ఆషామాషీ కాదని చెప్పినట్టు, అసలు అభియోగం ఏమిటో తెలుసుకోవాలని, ఆపైనే తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత క్రమంగా కవిత సిబిఐ నోటీసులపై లేఖాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు.
జారీ అయిన నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని తనకు ఇవ్వాలని, అప్పుడే తనకు సిబిఐ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడానికి వీలు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత లేఖను రాశారు. డాక్యుమెంట్లు అందిన తర్వాతే విచారణ తేదీని నిర్ణయిస్తానని కవిత ఈ లేఖతో మాట మార్చారు.

తాను నేడు వివరణ ఇవ్వలేనని లేఖ.. సీబీఐ అధికారులకు వేరే తేదీలు ఇస్తూ ఆప్షన్స్
ఇక తాజాగా నేడు సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి ఉండగా తాను ముందుగా షెడ్యూలు చేసుకున్న కార్యక్రమాల కారణంగా డిసెంబర్ ఆరో తేదీన హాజరు కాలేనని సిబిఐ అధికారులకు కవిత మరో లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. తాను విచారణకు సహకరిస్తానని, అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల ఆరవ తేదీ కాకుండా 11, 12, 14, 15 తేదీలలో ఏదో ఒక రోజు తాను అందుబాటులో ఉంటానని పేర్కొంటూ కవిత సిబిఐ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం.

కేసీఆర్ తో చర్చ ఎఫెక్ట్... కవిత నిర్ణయంలో మార్పు
ఇక ఇప్పటికే కవితను విచారించటం కోసం సిబిఐ అధికారులు హైదరాబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కానీ కవిత జగిత్యాల లో సీఎం కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లను పరిశీలించటం కోసం నేడు జగిత్యాల వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే తన విచారణ తేదీలను మార్చాలని కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తో చర్చల తర్వాత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కవిత నిర్ణయంలో మార్పు వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అభియోగం తెలిస్తే జాగ్రత్త పడవచ్చని భావిస్తున్న కేసీఆర్, కవిత, అందుకే ఇదంతా
మొదటి సీబీఐ అధికారులకు వివరణ ఇస్తానని పేర్కొన్న కవిత తర్వాత, తనపై పెట్టిన కేస్ ఏంటి.. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, తదనుగుణంగా కేసును నీరుగారి పోయేలా కోర్టులో తేల్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కవిత సిబిఐకి వివరణ ఇవ్వడానికి నిరాకరించడం గాని, లేదా వాయిదాలు వేస్తూ జాప్యం చేయడం గానీ చేస్తారని ప్రధానంగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ కేసులో సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.