తెలంగాణలోని ఈ రైలు రూట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని కాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్షా మార్గంలో ప్రయాణించే ప్రజలకు ఇది శుభవార్త. కాజీపేట నుంచి బల్లార్షా మధ్య నడిచే రైలు (17035), బల్లార్షా నుంచి కాజీపేట మధ్య నడిచే ట్రైన్ (17036) సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది.
గతంలో అజ్నీ ప్యాసింజర్ ట్రైన్‌గా నడిచిన ఈ రైలును కరోనా మహమ్మారి కారణంగా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ కొన్ని నెలకే నిలిపేశారు. దీంతో ఈ ట్రైన్ గుండా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలువురు ప్రజాప్రతినిధుల అనేక అభ్యర్థనల నేపథ్యంలో తాజాగా, ఈ రైలును పునరుద్ధరించారు.దీంతో ఈ మార్గం గుండా వెళ్లే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బల్లార్షా నుంచి కాజీపేటల మధ్య గతంలో నడిచిన విధంగానే ఈ అజ్ని ప్యాసింజర్.. ఇప్పుడు బల్లార్షా-కాజీపేట ఎక్స్‌ప్రెస్ పేరుతో సేవలు అందిస్తోంది. గతంలో మాదిరిగానే ఆయా స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆగుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ అవసరాల నిమిత్తం వెళ్లేవారికి సౌకర్యవంతంగా మారింది.
కాజీపేట నుంచి బల్లార్షా రైల్వే స్టేషన్ల మధ్య ప్రతిరోజూ ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి రోజూ రాత్రి 10.50 గంటలకు బల్లార్షా ఎక్స్‌ప్రెస్ (17035) బయల్దేరుతుంది. 11.09కి ఉప్పల్, 11.18-జమ్మికుంట, 11.32- ఓదెల, 11.41-పెద్దపల్లి, 11.47-రాఘవపురం, 11.54-రామగుండం, 12.14-మంచిర్యాల, 12.24-మందమర్రి, 12.34-బెల్లంపల్లి, 12.42-రేచిని రోడ్, 01.04-సిర్పూర్ కాగజ్ నగర్, 01.44-వీరూర్, 02.04-మణిఘడ్, మరుసటి రోజు తెల్లవారుజామున 03.10 గంటలకు బల్లార్షాకు వస్తుంది.
ఇక, బల్లార్షా నుంచి వేకువజామున 3.50 గంటలకు కాజీపేట ఎక్స్‌ప్రెస్(17036)గా తిరిగి బయల్దేరుతుంది. 03.59-మణిఘడ్, 03.45-సిర్పూర్ కాగజ్ నగర్, 05.07-రేచినిరోడ్, 05.15-బెల్లంపల్లి, 05.22-మందమర్రి, 05.30-మంచిర్యాల, 05.47-రామగుండం, 05.57-రాఘవపురం, 06.15-పెద్దపల్లి, 06.34-ఓదెల, 06.47-పొత్కపల్లి, 07.20-జమ్మికుంట, 07.30-ఉప్పల్, 07.43-హసన్‌పర్తిరోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా రాత్రి 08.50 గంటలకు కాజీపేట్‌కు ప్రయాణికులను చేరవేస్తుంది.












Click it and Unblock the Notifications