కాళ్లు మొక్కుడు, ఏడ్సుడు బంద్ చేయాలి: కెసిఆర్ శ్రమదానం (పిక్చర్స్)
కరీంనగర్: తాను ఉన్నానని, ఏడ్సుడు కాళ్లు మొక్కుడు బంద్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిన్నముల్కనూరు గ్రామ ప్రజలకు సూచించారు. ఆయన సోమవారంనాడు కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరు గ్రామంలో శ్రమదానం చేసి, సాయంత్రం గ్రామ సభలో ప్రసంగించారు. చిన్న ముల్కనూరుకు ఇతర దేశాల నుంచి ప్రజలు వచ్చేలా చేయాలని ఆయన అన్నారు.
పేదరికంపై, సమస్యలపై యుద్ధం చేయాలని ఆయన చెప్పారు. ఎన్ని ఇళ్లయినా సరే కట్టిస్తామని ఆయన చెప్పారు. భూమి ఇచ్చేవారు ముందుకు వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామని ఆయన అన్నారు. నాలుగైదు నెలల్లో సున్నాలు వేసుకుని కొత్త ఇళ్లలోకి ప్రవేశించాలని, ఆ కార్యక్రమానికి తాను వస్తానని ఆయన చెప్పారు. ఎన్ని ఇళ్లయినా తీసేసి, కొత్త ఇళ్లు కట్టిస్తారని ఆయన చెప్పారు. ఈ రోజు లాగా ఆ రోజు కూడా దావత్ చేసుకుందామని ఆయన చెప్పారు.
ఆరేడు నెలల్లో ఇళ్లకు నల్లా కనెక్షన్లు వస్తాయని, ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని బయటకు రాకుండా చేస్తామని కెసిఆర్ చెప్పారు. జివనాధారం లేనివారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, దీన్ని కూడా గ్రామప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. మన ఊరిలో ఎవరైనా ఉపాసం ఉంటే మనకు గౌరవం కాదని ఆయన అన్నారు.

కళ్ల జోళ్లు ఇప్పిస్తాం..
చిన్న ముల్కనూరు గ్రామ ప్రజలకు కళ్ల డాక్టర్లను తీసుకుని వచ్చి పరీక్షలు చేయించి ఉచితంగా కళ్లజోళ్లు ఇప్పిస్తామని, తానే డాక్టర్లను తీసుకుని వస్తానని కెసిఆర్ చెప్పారు.

ఆరోగ్య పరీక్షలు
ఆ తర్వాత పెద్ద పెద్ద వైద్యులను తీసుకుని వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన చెప్పారు.

వృత్తిలో శిక్షణ
ఊరిలోనే ఉపాధి అవకాశాలు కల్పించడానికి కుట్టుపనిలాంటి వాటిలో శిక్షణ ఇప్పిస్తామని, వారితో పని చేయించుకోవాలని, హైదరాబాదులో దుస్తులు కుట్టే విధంగా వారు తయారయ్యేలా చూస్తామని చెప్పారు.

నిరుద్యోగులు డిసిఎంలు
నిరుద్యోగులకు డిసిఎంలు కొనిచ్చి వారికి ఉపాధి కల్పించాలని, గ్రామస్థులు వారి సేవలను వాడుకుని వారికి ఉపాధి కలిగేలా చూడాలని కెసిఆర్ చెప్పారు.

అందరూ సంతోషంగా..
గ్రామంలో అందరూ సంతోషంగా, గొప్పగా బతికే పరిస్థితి ఉండాలని కెసిఆర్ అన్నారు. చేతి నిండా పనిచేసి కడుపు నిండా తిని పడుకునేట్లు ఉండాలని ఆయన చెప్పారు.

కులం, మతం లేదు..
కులం, మతం లేదు, చిన్నముల్కనూరును ఆదర్శ గ్రామంగా చేద్దాం, ఏ ఇళ్లయినా సరే, లేఅవుట్ చేసి చేద్దాం, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకుందామని కెసిఆర్ చెప్పారు. అవసరమైతే పైన మరో పోర్షన్ వేసుకునే విధంగా ఇళ్లను కట్టిస్తామని కెసిఆర్ చెప్పారు.

అవసరమైతే మరో పోర్షన్..
కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖనికి పద్ధతి ప్రకారం కూరగాయలు పండించి సరఫరా చేయాలని, ఇందులో కూడా శిక్షణ ఇప్పిస్తామని, వచ్చే రెండేళ్లలో నీటి కొరత ఉండదని, బావులూ బోర్లు వేసుకోవాల్సిన అవసరం లేదని కెసిఆర్ అన్నారు.

అంకాపూర్ చూసి రండి..
తాను బస్సులు ఏర్పాటు చేస్తానని, అంకాపూర్ చూడండి, ప్రగతి రిసార్ట్ కూడా చూసి రండని కెసిఆర్ చిన్న ముల్కనూరు గ్రామ ప్రజలకు చెప్పారు.

తిట్లు వద్దు..
గ్రామంలో అపశకునాలు వద్దు, తిట్లు వద్దు, రేపటి నుంచి బంద్ చేయాలని కెసిఆర్ సూచించారు. అది పక్కా మాటగా ఆచరించాలని ఆయన గ్రామప్రజలతో చెప్పించారు.

కెసిఆర్ గుర్తు రావాలి..
ఎవరైనా తిట్టాలని అనుకోగానే కెసిఆర్ గుర్తు రావాలని, ఒక వేళ అన్నా తప్పయిందని చెప్పాలని కెసిఆర్ గ్రామ ప్రజలకు చెప్పారు. కొంత కాలం తర్వాత తిట్టు వినపడితే యాభై రూపాయలు ఫైన్ వేయాలని ఆయన అన్నారు.

ఒక్కో మెట్టే ఎక్కండి..
మంచి వైపు ప్రయాణం చేయాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలని, ఒకేసారి అంతా కాదని కెసిఆర్ అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చిన్న ముల్కనూరు గ్రామం ద్వారా గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సూచిస్తానని ఆయన చెప్పారు.

అపార్థాలతో ఉన్నారు..
అపార్థాలు వద్దని, పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ సమాన బాధ్యులేనని కెసిఆర్ చెప్పారు. గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని ఆయన చెప్పారు.

ముఠా తగాదాలు వదిలేయాలి...
గ్రామజ్యోతి ఈ రోజే వెలిగించామని కెసిఆర్ చెప్పారు. ప్రజా ప్రతినిధులంతా ముఠా తగాదాలు వదిలిపెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన సూచించారు.

ఒక దారి పడితే..
ఒక్క దారి పట్టాం, వంద శాతం బాగుపడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. అందరం కలిసి అందరిని బతికించే ప్రయత్నం చేద్దామని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications