కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలుదినం కావాలా?దిష్టిబొమ్మల దహనానికి రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోని, రైతుల నిరుద్యోగుల ఆత్మహత్యలను పట్టించుకోని తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి గాడిదకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
కెసిఆర్ జన్మదినం ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కెసిఆర్ జన్మదినం ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అంటూ మండిపడ్డారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆవేదన చెందుతుంటే, నిరుద్యోగుల ఆత్మహత్యకు పాల్పడుతుంటే సమాధానం చెప్పకుండా ఉత్సవాలు జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చెయ్యండి
కెసిఅర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినం గా మారిందని, కెసిఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగించాలని మరోమారు పిలుపునిచ్చారు . ఇప్పటివరకు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయని కేసీఆర్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ సానుభూతిపరులపై ఎమ్మెల్యే దాడిపై మండిపడిన రేవంత్ రెడ్డి
కెసిఆర్ పుట్టిన రోజు పేరుతో టీఆర్ఎస్ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరులపై పోలీసుల సమక్షంలోనే స్వయంగా ఎమ్మెల్యే దాడి చేయడం ఆటవిక చర్య అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి త్వరలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications