'షా'పై మంట: మోడీతో కేసీఆర్ గట్టిగానే, 'లెక్క' సరిచూసుకోమని జైట్లీకి!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీరును తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు.
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీరును తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. విషయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. షా చెప్పిన తప్పుడు లెక్కలపై గట్టిగానే వాదించినట్లు తెలుస్తోంది. అటు మోడీ సైతం.. "మీ వద్ద సరైన లెక్కలున్నాయిగా" అంటూ సానుకూలంగా బదులిచ్చారట.
కాగా, ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధుల గురించి అమిత్ షా పెద్ద లెక్కలే చెప్పారు. దీన్ని తప్పుపట్టిన కేసీఆర్.. తనదైన స్టైల్లో ఉతికారేశారు. సంబంధం లేని లెక్కలతో తెలంగాణ జనాన్ని మాయ చేస్తున్నారంటూ మండిపడ్డారు. బజారులో పాములాట పెట్టి గిమ్మిక్కులు చేస్తామంటే కుదరదని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, కేంద్రానికి 2016-17లో మేమిచ్చింది రూ.50 వేల కోట్లు.. మాకు కేంద్రం ఇచ్చింది రూ.24.5 వేల కోట్లు. అలాగే మూడేళ్లలో మాకిచ్చింది రూ.67,390 కోట్లు అని లెక్కలతో సహా కేసీఆర్ అప్పట్లో వివరించారు. ఇప్పుడదే అంశాన్ని ప్రధాని దగ్గర ప్రస్తావించారు. అమిత్ షా తెలంగాణ జనానికి తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.
అయితే ప్రధాని మాత్రం అమిత్ షా తన వద్ద అలా ఏం మాట్లాడలేదని చెప్పడం గమనార్హం. దీంతో ఇవ్వని నిధులను ఇచ్చినట్లు చెబితే ఎలా అని కేసీఆర్ తిరిగి ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. 'మీ వద్ద అన్ని లెక్కలు ఉన్నాయిగా" అంటూ ప్రధాని స్పందించారు.
ఇక తెలంగాణ వృద్ధి రేటు విషయంలో అటు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతోను కేసీఆర్ గట్టిగానే వాదించినట్లు తెలుస్తోంది. విభజన అనంతరం తెలంగాణ అభివృద్ధి రేటు 10 శాతంగా ఉందని జైట్లీ ప్రస్తావించగా.. 'మీకెవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు' అంటూ కేసీఆర్ బదులిచ్చారట.
తెలంగాణ వృద్ధి రేటు 21.5 శాతం ఉంది, కావాలంటే అసలైన లెక్కలు తెప్పించుకుని చూడండి.. అంటూ కేసీఆర్ గట్టిగానే సమాధానం చెప్పారట.












Click it and Unblock the Notifications