
ఎమ్మెల్యేల కొనుగోళ్ళ సస్పెన్స్ థ్రిల్లర్ వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ : వైఎస్ షర్మిల సంచలనం
వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్తానం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఇక తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ షర్మిల తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ అంశంపై టీఆర్ఎస్ పార్టీని, బీజేపీని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పటికే కొనుగోలు చేసింది ఎవరు? అమ్ముపోయింది ఎవరు? అంటూ రెండు పార్టీలను టార్గెట్ చేసి మండిపడ్డారు. ప్రజలకు ఈ వ్యవహారంలో నిజం తెలియాలన్నారు. ఇక తాజాగా మరోమారు వైఎస్ షర్మిల మళ్ళీ ఈ వ్యవహారంపై నిప్పులు చెరిగారు.

సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని కేసీఆర్ రహస్య జీవో దేనికి : వైఎస్ షర్మిల
కేసీఆర్ తన ఎమ్మెల్యే లతో ఫామ్ హౌజ్ స్టోరీ సృష్టించి, సానుభూతితో మునుగోడులో గెలవాలనుకున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ కోర్టుకెళ్తే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదని కేసీఆర్ రహస్య జీవోను విడుదల చేశాడట అంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేశారు .మీకు నిజంగా నిజాయతీ ఉంటే సీబీఐ వస్తే భయమెందుకు? అంటూ ఫాం హౌస్ స్టోరీ కేసీఆర్ సృష్టి అని వైఎస్ షర్మిల ఆయనను టార్గెట్ చేశారు.
సింపతీ ఓట్ల కోసం కేసీఆర్ కొత్త సినిమా
మునుగోడులో గెలవాలని ఊరికో ఎమ్మెల్యేను, రాష్ట్రంలోని అందరు మంత్రులను రంగంలోకి దింపారు. అదీ చాలదన్నట్టు కేవలం సింపతీ ఓట్ల కోసం కొత్త సినిమాకు తెరలేపిన కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ఈ కథను రక్తి కట్టించారు. ఇక ఈ కేసులో బీజేపీ సీబీఐ విచారణ కోరితే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టటానికి వీలు లేదని రహస్య జీవో జారీ చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు తెలియని కేసీఆర్ విడుదల చేసిన రహస్య జీవోలు ఇంకా మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఆధారాలుంటే బయట పెట్టటానికి దేనికి భయం?
అసలు కేసీఆర్ ఈ వ్యవహారంలో రోజుకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ అది చేస్తా ఇది చేస్తా అని చెప్పటం తప్ప చేసిందేమిటి అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులైతే కేసీఆర్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అన్నది చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. అసలు సరైన ఆధారాలుంటే బయటపెట్టటానికి ఎందుకు భయం అంటున్నారు. కేసీఆర్ ఈ ఎపిసోడ్ ను సాగదీయటం వెనుక ఉన్న మతలబు అందరికీ తెలుసన్నారు.

మీరు తప్పు చెయ్యకుంటే భుజాలు తడుముకోవటం దేనికి?
మీరు తప్పు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల ఎందుకు సిబిఐ విచారణను అడ్డుకుంటున్నారు? చెప్పాలని నిలదీశారు . నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనబోయిందని గగ్గోలు పెట్టి, విచారణ చేయిస్తాం అని, ఏకంగా విచారణ సంస్థలనే అడ్డుకుంటారా అంటూ షర్మిల ప్రశ్నించారు. దివాలాకోరు ద్వంద్వనీతిఅంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేశారు.