అదంతా కెసిఆర్ ఫ్యామిలీ డ్రామా: కవిత-కెటిఆర్‌లపై షబ్బీర్ అలీ
హైదరాబాద్/వరంగల్: గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ శుక్రవారం నాడు మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కెటిఆర్, ఎంపి కవితలు గల్ఫ్ వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత గల్ఫ్ బాధితులు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. వరంగల్ ఉప ఎన్నికలు ఉన్నందునే గల్ఫ్‌కు వెళ్లి బతుకమ్మ, బోనాలు అంటు కెసిఆర్ కుటుంబం డ్రామాలు చేస్తోందన్నారు. వారి బాధలు కనిపించడం లేదా అని నిలదీశారు.
పాలన అంతా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్ నుంచే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలన పైన ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని చెప్పారు.

ప్రొటోకాల్ ఉల్లంఘనలపై తెలంగాణ సీఎస్‌కు ఫిర్యాదు
జీహెచ్‌ఎంసీ పరిధిలో మంత్రులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. సచివాలయంలో టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సాయన్న, ప్రకాశ్ గౌడ్, బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు... సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు.
వారు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను తెరాస కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారన్నారు.
పాలన గాలికి: సందీప్ రెడ్డి
కెసిఆర్ పాలనను గాలికి వదిలేసిందని తెలంగాణ టిడిపి నేత ఎలిమినేటి సందీప్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ గత ఆరు నెలల్లో నాలుగుసార్లు మాత్రమే సచివాలయానికి వచ్చారని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 1845 మంది రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications