
ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ ... లైట్ తీసుకోవద్దంటూ గులాబీబాస్ క్లాస్ .. రీజన్ ఇదే !!
తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. చాలాకాలంగా ఎన్నికలపై కేటీఆర్ ని రంగంలోకి దించిన కేసీఆర్ ఈసారి ఎన్నికలపై ఆయన నేరుగా ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎదురైన అనుభవాల దృష్ట్యా, ఈసారి అటువంటి పరిస్థితి ఉండకూడదని ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత వెంటనే రానున్న ఎన్నికలపై కూడా ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు.
నిజామాబాద్ లో వార్ వన్ సైడే .. ఎమ్మెల్సీగా కేసీఆర్ తనయ కవిత ఎన్నిక లాంఛనప్రాయమే !!

అలసత్వం వద్దు .. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చెయ్యాలని పిలుపు
హైదరాబాద్ - రంగారెడ్డి - ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ - వరంగల్ - ఖమ్మం రెండు సీట్లు కైవసం చేసుకోవాలని కెసిఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ మాత్రం అలసత్వం , నిర్లక్ష్యం వహించవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇటీవల పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా కార్పొరేషన్ ఎన్నికల పై గురి పెట్టిన గులాబీ బాస్ ఆయా జిల్లాల ముఖ్యనేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ ఓటు నమోదు చేయించి పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేయాలని కేసీఆర్ వారికి సూచించారు.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ లకు దక్కిన స్థానాలు
గతంలో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించడం అలాగే ఉమ్మడి మెదక్ - కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించడంతో గులాబీ బాస్ ఖంగు తిన్నారు. ఈసారి ఎలాగైనా పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను లైట్ తీసుకోకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

పోటీలో హేమాహేమీలు .. గులాబీ నేతలకు గట్టి పోటీ
హైదరాబాద్ - రంగారెడ్డి - ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ - వరంగల్ - ఖమ్మం స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టభద్రుల కోటాలో శాసనమండలిలో అడుగు పెట్టడం కోసం రాజకీయ పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు సైతం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఈసారి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా దిగుతున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
Recommended Video

విద్యావంతులు , యువత టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న సంకేతం ఇచ్చేలా ... వ్యూహాత్మకంగా
సీఎం కేసీఆర్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి, ఎక్కువమంది గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదు చేయించి, ఎన్నికలలో విజయం సాధించేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. యువత, విద్యావంతులు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని సంకేతం ఇచ్చేలా చూడాలన్నారు . ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అనే భావనలో గులాబి బాస్ కేసీఆర్ ఉన్నారు.