కేసీఆర్ కు జగన్ తో చీకటి ఒప్పందం.. సోయి లేని సీఎం : డీకే అరుణ ధ్వజం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్న అరుణ కెసిఆర్ ను, జగన్ ను తిట్టిపోశారు. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటే అని చెప్పిన కేసీఆర్ ఎక్కడికి పోయారని ఎద్దేవా చేశారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ తో కెసిఆర్ కు చీకటి ఒప్పందం ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్డీఎస్ నుండి అక్రమంగా నీటిని తరలించకు పోతున్నారని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ కు సోయి లేదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు . కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే ఫాం హౌస్ నుండి బయటకు వచ్చి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారని విమర్శలు గుప్పించారు.

హుజురాబాద్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవి చూస్తుంది అని చెప్పిన డీకే అరుణ హుజూర్ నగర్ లో బీజేపీ గెలవబోతున్నదని పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టుల పై కేసీఆర్ కు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications