యాగం బిజీలో కెసిఆర్, రేపు శృంగేరికి: చండీయాగం కోసం భారీ ఏర్పాట్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠానికి వెళ్లనున్నారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామిని కేసీఆర్ ఆహ్వానిస్తారు.
రేపు ఉదయం పదిన్నర గంటలకు ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శృంగేరి మఠం చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు భారతీతీర్థ స్వామిని కలిసి చండీయాగం ఆహ్వానిస్తారు. పత్రికను అందిస్తారు. సాయంత్రం ఐద గంటలకు హైదరాబాద్ వస్తారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌ను కూడా కెసిఆర్ చండీయాగానికి ఆహ్వానించారు. షిల్లాంగులో ఉన్న రవిశంకర్‌తో కెసిఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కెసిఆర్ ఆహ్వానానికి రవిశంకర్ జీ సానుకూలంగా స్పందించారు.

కెసిఆర్ ఇప్పటికే పలువురు ప్రముఖులను యాగానికి ఆహ్వానించారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడకు వెళ్లి మరీ ఆహ్వానించారు. సాయంత్రం కెసిఆర్ దంపతులు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ దంపతులకు ఆహ్వాన పత్రం ఇచ్చారు.
కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు అయుత చండీయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యాగశాలల నిర్మాణం, రుత్విక్కులకు బస, ఆహ్వానితులకు, ముఖ్యమైన అతిథులకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
యాగ కార్యక్రమాలను, రుత్విక్కులతో సమన్వయం వంటి అంశాల పర్యవేక్షణ అష్టకళా రామ్మోహన్ శర్మకు అప్పగించారు. 30 ఎకరాల స్థలంలో యాగం ఏర్పాట్లు చేస్తున్నారు. 40,000 చ.అ. విస్తీర్ణంలో ప్రధాన యాగశాల నిర్మాణానికి వెదురు బొంగులు, వరి గడ్డి వినియోగిస్తున్నారు.

101 హోమ గుండాలు నిర్మిస్తున్నారు. ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 1,500 రుత్విక్కులు వస్తున్నారు. వారి సహాయకులు వందలాది మంది వస్తున్నారు. యాగశాల, భోజనశాలల ఆహ్వాన ద్వారాలను ఆర్ట్ డైరెక్టర్ రమేష్ ప్రత్యేక రీతిలో అలంకరిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి 150 మంది వంటవాళ్లు వస్తున్నారు. ఇతరులు, సాధారణ ప్రజల కోసం
రోజుకు సుమారు 50,000 భోజనాల ఏర్పాటు చేస్తున్నారు. భోజనశాలలో ఒకేసారి 10,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వివిధ పీఠాలు, మఠాల నుంచి వచ్చే పీఠాధిపతులు, వీవీఐపీల కోసం ప్రత్యేక కాటేజీలు నిర్మిస్తున్నారు. రుత్విక్కుల కోసం ప్రత్యేక వసతి సదుపాయం ఉంటుంది. కెసిఆర్ ఫాం హౌస్ వద్ద హెలీ ప్యాడ్ ఉంటుంది. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా యాగం ఏర్పాట్లు పూర్తి చేయాలని కెసిఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications