రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మంచోడు: బీజేపీ ఎంపీ అరవింద్ మాట!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ప్రధాన పార్టీలు అన్నింటిలోనూ ముఖ్య నేతలు వరుస పర్యటనలు చేస్తూ ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు ఎంపీ అరవింద్. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ నే మంచోడని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రధాన పోటీ బి ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఎంపీ అరవింద్ రేవంత్ రెడ్డి కంటే కెసిఆర్ నే మంచోడని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న కూడా గొర్లను మింగేటోడు కెసిఆర్ అయితే బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. హైదరాబాద్ నేనే కట్టాను అని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణలో పోటీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన ఆయన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.తెలంగాణా ప్రజలు అంతా చూస్తున్నారన్నారు.
అవినీతి కేసీఆర్ ను మించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే పూర్తిగా చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడని ఎంపీ అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనకు, దొంగల పాలనకు చరమగీతం పాడాలని, డబుల్ ఇంజిన్ పాలనకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్న ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే పార్టీలేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications