కేసీఆర్ వస్తున్నారు: జగిత్యాల సభలో బయటపడబోతున్న అసలు నిజాలు!
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం వరకు తనదైన ముద్ర వేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జగిత్యాల గడ్డ మరోసారి గులాబీమయం కాబోతోంది. ఈ నెల 20న జగిత్యాలలోని మోతె రోడ్డులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభ కేవలం ఒక చేరికల కార్యక్రమం మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో సరికొత్త మలుపుగా నిలవనున్నది. పదేళ్ల కేసీఆర్ జమానాలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న క్రమంలో చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడం, బీఆర్‌ఎస్‌లోకి జీవన్ రెడ్డి చేరిక వంటి సందర్భాలతో అందరి కళ్లు జగిత్యాల వైపే చూస్తున్నాయి.
ఈ సభలో ప్రధాన ఆకర్షణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి.. కేసీఆర్ స్వహస్తాలతో గులాబీ కండువా కప్పుకోనుండటం రాజకీయంగా పెను సంచలనమే. ఆయనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్ గూటికి చేరనున్నారు. కేసీఆర్ దార్శనికతతోనే రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని భావించి తామంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పేర్కొంటున్నారు.

జగిత్యాల నుంచే సరికొత్త ప్రయాణం!
జగిత్యాల గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచే ఏ పోరాటమైనా మొదలైతే అది రాష్ట్రవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కేసీఆర్ జగిత్యాలను తన తదుపరి కార్యాచరణకు వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు నియోజకవర్గ స్థాయి నేతలు, సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో మొదలైన ఈ ఊపు దక్షిణ తెలంగాణకు కూడా వ్యాపించి, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ అజేయ శక్తిగా ఎదగబోతోందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సభకు చకచకా ఏర్పాట్లు.. ఇన్‌ఛార్జుల నియామకం
జగిత్యాల సభను అప్రతిహతంగా విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. జగిత్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్ల: వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురి: ఎమ్మెల్సీ రవీందర్ రావు, వేములవాడ: బాల్క సుమన్, చొప్పదండి: పెద్ది సుదర్శన్ రెడ్డి.. వీరితో పాటు జన సమీకరణ, ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలను గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు అప్పగించారు. లక్షలాది మందితో నిర్వహించే ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయ దిశను మార్చడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications