ప్రాణం లెక్కచేయకుండా పోలీసుల సాహసం: కేసీఆర్
హైదరాబాద్: పోలీసులు ధైర్యసాహసాలు ప్రదర్శించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల ఘటన పైన కేసీఆర్ స్పందించారు. ఈ ఎదురుకాల్పుల్లో సిమి ఉగ్రవాదులుగా భావిస్తున్న అస్లాం, జకీర్‌లు మృతి చెందారు.
వారితో పాటు ఎదురు కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్ మృతి చెందారు. ఇద్దరు ఎస్సైలు సహా, పోలీసులగు గాయాలయ్యాయి. దీనిపై కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో సంఘ విద్రోహశక్తుల పైన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్రోహులను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గొప్ప ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించారన్నారు.

సూర్యాపేటలో కాల్పుల తర్వాత జరిగిన ఘటనల్లో పోలీసులు స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని, దుండగుల్లో మృతి చెందిన కానిస్టేబుళ్లు నాగరాజు (నిన్నటి ఎదురు కాల్పుల్లో మృతి చెందారు), లింగయ్య, హోంగార్డు మహేష్ (వీరిద్దరు మూడు రోజుల ముందు సూర్యాపేట కాల్పుల్లో మృతి చెందారు)లది గొప్ప త్యాగమన్నారు. అమరులుగా వారు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications