నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ.. మునుగోడు అభ్యర్థి ఎవరంటే..?
మునుగోడు స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించింది. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. తర్వాత వంతు టీఆర్ఎస్‌దే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి నిలుస్తుండటంతో వారికి ధీటుగా ఎవరిని నిలబడెదామనే అంశంపై కేసీఆర్ నాయకుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రెడ్డి సామాజికవర్గం అభ్యర్థిని నిలబెట్టాలా? బీసీల నుంచి నిలబట్టాలా? అనే అంశంపై కూలంకుషంగా చర్చించారు.

అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉండటంతో ఎవరి పేరు అనే విషయమై కేసీఆర్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఆ పార్టీ తరఫున మునుగోడు నుంచి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి పాల్వాయి స్రవంతిని బరిలో నిలిపింది. ఆమె పేరును రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి మాటలను కాదని వెంకటరెడ్డి సూచనపై స్రవంతిని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఇద్దరు అభ్యర్థులకు ధీటైన అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ మదిలో ఉందని, ఆయన సమయం చూసి ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications