నేడు మోడీతో కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రధాని మోడీతో భేటీ అవనున్నారు. దేశంలోని కరువు పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం నాడు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ప్రధాని మోడీ మంగళవారం నాడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం జరగనున్న ఈ భేటీ కోసం సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సమావేశంలో భాగంగా.. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, తాగునీరు వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ చర్యలపై కూడా సమావేశంలో చర్చకు రానున్నట్టు సమాచారం. వరుస కరువులతో రాష్ట్రంలో తీవ్ర కరువు ఏర్పడ్డమే గాక, ఉపాధి రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుండడంతో కేంద్రం నుంచి వీలైనంత మేర సహాయం పొందాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్.

ఈ నేపథ్యంలోనే.. కరువు, ఉపాధికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ రాజీవ్ శర్మ నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేశారు. నివేదికలోని అంశాలను ప్రధానితో భేటీలో భాగంగా ప్రస్తావనకు తీసుకురానున్నారు కేసీఆర్. అలాగే.. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న కొత్త నియోజక వర్గాల గురించి కూడా ప్రధానికి వివరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కోరిన సహాయంలో కేంద్రం 25 శాతం సహాయాన్నే అందించడంతో.. రాష్ట్రానికి ఆర్థిక
సహాయంపై అందించే విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కోరనున్నారు సీఎం. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 3వేల కోట్ల సహాయాన్ని కోరగా కేంద్రం 712 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అలాగే ఈ ఏడాది కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర విపత్తు సహాయ నిధిని కూడా ఎస్డీఆర్ఎఫ్ తక్షణం విడుదల చేయాల్సిందిగా ప్రధాని మోడీకి విన్నవించనున్నారు సీఎం కేసీఆర్. ఇక భేటీ ముగిసిన తర్వాత బుధవారం తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు కేసీఆర్.












Click it and Unblock the Notifications