‘కేసీఆర్ కనబడుటలేదు’: సిటీలో పోస్టర్ల కలకలం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం 'కేసీఆర్ కనబడుట లేదు' అంటూ హైదరాబాద్ నగరంలో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.

అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం
భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.
ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని హరీశ్ రావు తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చాయన్నారు.

తాను ఖమ్మం వెళ్లి వరద బాధితులను పరామర్శించానని హరీశ్ రావు తెలిపారు. వారిని చూస్తే తన కళ్లలో కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మట్టి వినాయకుని పంపిణీ చేశారు. చెరువులను కాపాడడం మన అందరి బాధ్యత అని, మట్టి వినాయకులను పూజిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చెరువులో చేపలు చనిపోతున్నాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దని అన్నారు.












Click it and Unblock the Notifications