గదేందిరా భయ్... 'గులాబీ' అంటేనే గత్తర్.. గత్తర్!!
మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 10వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి చెందలేదు. భారతీయ జనతాపార్టీకి ఈస్థాయిలో ఓట్లు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏక్షణంలో ఎన్నికలు జరిగినా గులాబీ జెండాలు రెపరెపలాడించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.

సిద్ధమైన ప్రణాళిక
అందుకనుగుణంగా ఆయన తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ తోపాటు భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ బరిలో నిలవడంతో రానున్న ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగడం ఖాయమని స్పష్టమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే విషయమై కేసీఆర్ తాజాగా సర్వే నిర్వహింపచేశారు. ప్రతి నియోజకవర్గంలోను ముక్కోణపు పోటీ జరగడం ఖాయమని తేలింది. గులాబీ పార్టీ కచ్చితంగా గెలిచేవి, కొంచెం కష్టపడితే గెలిచేవి, గెలవలేని నియోజకవర్గాలను కేటగిరీలవారీగా గుర్తించారు. కచ్చితంగా గెలిచేవి 38 నుంచి 40 వరకు ఉండగా, కొంచెం కష్టపడితే 30 నుంచి 35 నియోజకవర్గాలు కారు ఖాతాలో వేసుకోవచ్చని గుర్తించారు. కచ్చితంగా గెలిచే వాటిని ఏ కేటగిరిలో పెట్టారు. కాస్తంత కష్టపడితే గెలిచేవాటిని బి కేటగిరిలో ఉంచారు.

బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు సి కేటగిరి
బీజేపీ, కాంగ్రెస్ తో పోరాడటానికి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను సి కేటగిరిలో చేర్చారు. ఈ సీ కేటగిరిలో మంత్రులు కూడా ఉన్నారు. వారి గెలుపు ఈసారి అసాధ్యమని తేలడంతో అక్కడ కొత్తవారికి కేసీఆర్ టికెట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలుపుకొని 10 మంది ఉన్నారు. పార్టీ ఇక్కడ గెలవడం కోసం నూతన ఇన్ ఛార్జిలను నియమించబోతోంది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా అంతా కొత్తవారే చేయాలని పార్టీ నిర్ణయించింది.

త్వరలోనే నూతన ఇన్ ఛార్జిల నియామకం
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్ లోటుపాట్లను గుర్తించి ఎక్కడికక్కడ వాటిని సరిదిద్దుతున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీ ఎంత బలోపేతంగా ఉందో ప్రత్యర్థి పార్టీలకు నిరూపించాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను బలమైన నేతలకు, బలమైన మంత్రులకు ప్పగించబోతున్నారు. త్వరలోనే ఇక్కడ ఇన్ ఛార్జిల నియామకం కూడా జరగబోతోంది. ఈ విధంగా పార్టీ తరఫున ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని బీజేపీని, కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ నూతన జవసత్వాలను సమకూర్చుతున్నారు.












Click it and Unblock the Notifications