నో దయ! అలజడికి బాబు కుట్ర: గవర్నర్‌కు కేసీఆర్ ఫిర్యాదు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా నాయుడు పైన ఏమాత్రం జాలి చూపేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఆయన పట్ల కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధపడ్డారని చెబుతున్నారు.
కేసీఆర్ బుధవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. చంద్రబాబు పైన ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసులను దింపి అలజడికి కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏసీబీ పూర్తిగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందని, తమ పరిధిని ఏ మాత్రం అతిక్రమించడం లేదని కేసీఆర్ గవర్నర్‌కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో దాదాగిరి చేసేందుకు ప్రయత్నిస్తోందని, భద్రత పేరిట వారి రాష్ట్ర పోలీసులను హైదరాబాద్‌లో మోహరించడం తీవ్ర అభ్యంతకరమని ఫిర్యాదు చేశారు.
ఒక రాష్ట్ర శాంతిభద్రతల అంశంలో మరో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని సమాచారం. కేసీఆర్ మధ్యాహ్నం రాజ్ భవన్‌లో దాదాపు అరగంట సేపు నరసింహన్‌తో భేటీ అయ్యారు.

ఓటుకు నోటు కేసు సాకుతో చంద్రబాబు తెలంగాణలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏపీ నుంచి పెద్దఎత్తున పోలీసులను తరలించడం వెనక ఇదే కుట్ర ఉందని పేర్కొన్నట్లు సమాచారం. సెక్షన్-8 పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారని సమాచారం. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
ఢిల్లీకి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రవిశంకర ప్రసాద్, నితిన్ గడ్కరీలను కలవనున్నారు.












Click it and Unblock the Notifications