మమతా ర్యాలీకి 'కేసీఆర్' దూరం..! క్లారిటీ ఇచ్చిన 'కవిత'.. మరీ 'పల్లా' చెప్పిందేంటి?
హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టే విధంగా గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ దూరంగా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మమతా ర్యాలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని మీడియాకు వివరించారు ఎంపీ కవిత.

మమతా ర్యాలీకి టీఆర్ఎస్ డుమ్మా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమికి తరుణం ఆసన్నమైందని భావిస్తున్న కేసీఆర్... జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. అందులోభాగంగా ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తెచ్చారు. ఆ క్రమంలో డిసెంబర్ నెలలో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. ఆ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై సుదీర్ఘంగా చర్చించారు. అయితే కోల్‌కతాలో ఆమె నేతృత్వంలో నిర్వహించిన విపక్షాల ఐక్యత ర్యాలీకి టీఆర్ఎస్ డుమ్మా కొట్టడం చర్చకు దారి తీసింది.

అందుకే పోలే..! కవిత వివరణ
మమతా ర్యాలీకి టీఆర్ఎస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ ఎంపీ కవిత స్పందించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ తొలి సమావేశాలు జరగడంతో కేసీఆర్ సభాధ్యక్షుడిగా ఉన్నారని.. అందుకే ఆయన వెళ్లలేకపోయారని చెప్పారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఇలా ముఖ్యమైన అంశాలు సభ నిర్వహణలో భాగం కావడంతో కేసీఆర్ ఉండాల్సి వచ్చిందని వివరించారు. అయితే భవిష్యత్తులో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు జాతీయస్థాయిలో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా టీఆర్ఎస్ ముందుంటుందని తెలిపారు.
ఫెడరల్ ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇంతవరకు తేలకపోయినప్పటికీ... దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు చెప్పారు. ప్రజల జీవితాలను మార్చే అజెండాతో ఫెడరల్ ఫ్రంట్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఇతర కూటముల్లో ఒక పార్టీ అభిప్రాయాన్ని మరో పార్టీ గౌరవించే పరిస్థితి లేదని.. ఫెడరల్ ఫ్రంట్ లో అలాంటి సీన్ ఉండబోదన్నారు. ఎన్నికల ముందు పొత్తులుంటాయన్న కవిత.. ఎలక్షన్ల తర్వాత కూడా అవి కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పల్లా అలా.. కవిత ఇలా..!
మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి కేసీఆర్ వెళ్లకపోవడంపై టీఆర్ఎస్ ముఖ్య నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పిన కారణం చర్చకు దారి తీసింది. ఆ వేదికపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదనేది పల్లా చెప్పిన మాట. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలొచ్చిన కొద్దిగంటల్లోనే కవిత వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications