ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు: బండి సంజయ్ సంచలనం
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా హస్తం గూటికి చేరారు. మరికొందరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్యయంగా ఆ పార్టీ అధినేత కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టీకి.. కేసీఆర్ సహకరిస్తున్నారని అన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదన్నారు. రైతులను మోసం చేసే విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు బండి సంజయ్. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ సర్కారు అణిచివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారనడానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కార్యకర్తల పోరాటంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్నారు.
తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ ప్రధాని నరేంద్ర మోడీ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా మోడీ మాత్రమే గ్యారంటీ అంటున్నారని చెప్పారు. రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications