కెసిఆర్! నీ మనవడు తినేదేంటి, ఇంత దుర్మార్గమా: రేవంత్, ఊరు తిరిగిన సీఎం
హైదరాబాద్/మెదక్: సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం పెడతామంటే సంతోషించామని, కానీ వాటికి బదులు దారుణమైన బియ్యంతో ప్రభుత్వం అన్నం పెడుతోందని, ఆ అన్నంను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు ఎవరైనా తినగలరా అని తెలంగాణ టిడిపి యువనేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వసతి గృహ విద్యార్థులకు సన్న బియ్యంకు బదులు దారుణమైన బియ్యంతో ప్రభుత్వం అన్నం పెడుతోందన్నారు.సన్నబియ్యం ముసుగులో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వసతి గృహాల్లో బియ్యంపై నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలని, విజిలెన్స్ దాడులు చేయించాలని సవాల్ చేశారు. కెసిఆర్ మనవడు ఏ రకమైన సన్నబియ్యం తింటారో అదే రకం బియ్యం పంపిణీ చేయాలన్నారు.

వసతి గృహాల్లో దొడ్డు బియ్యం అవినీతిపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంలో వాడుతునన్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుందన్నారు.
ఓ పత్రికాధినేత ఈ కుంభకోణంలో ఉన్నారన్నారు. ప్రొటీన్స్ లేని బియ్యం తినడం వల్ల విద్యార్థుల అనారోగ్యం చెడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఈ దారుణాల పైన మంత్రి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలన్నారు.
ఎర్రవల్లిలో పర్యటనలో సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో సీఎం పాల్గొన్నారు.
దృష్టిలోపం ఉన్న వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం కెసిఆర్ మాట్లాడుతూ... ఎర్రవల్లిలో ఉగాది నాటికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. భూ కమతాల ఏకీకరణ చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు.
మౌలిక వసతులపైనే ప్రధాన దృష్టి: తుమ్మల
తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ సీఎం కేసీఆర్ మౌలిక వసతులపై దృష్టి పెట్టారని రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో రూ.50 కోట్ల నిధులతో వసతిగృహం, రహదారి విస్తరణకు ఆయన మంత్రి హరీశ్ రావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో 1,272 కిలో మీటర్ల రహదారుల కోసం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... పటాన్‌చెరులో టీఎఫ్‌ఐఐసీకి చెందిన 14 ఎకరాల స్థలాన్నిమార్కెట్ కోసం మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం బాధాకరం: దత్తాత్రేయ
రోజురోజుకూ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుండటం బాధాకరమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా భాగ్యనగరంలోని చార్మినార్ నుంచి బేగంపేట వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. దీనిని దత్తాత్రేయ జెండా ఊపి ప్రారంభించారు.












Click it and Unblock the Notifications