హస్తినలో వారం పాటు గులాబీ బాస్ కేసీఆర్ మకాం.. టార్గెట్ ఫిక్స్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ హస్థినకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మే నెల మొదటి వారంలో కెసిఆర్ ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా విస్తరించడం కోసం ఢిల్లీ కేంద్రంగా కెసిఆర్ వివిధ పార్టీల నాయకులతో, మేధావులతో వరుస సమావేశాలలో బిజీగా ఉండనున్నారు. మే మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్లో కొత్త సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత కెసిఆర్ మే రెండవ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. మే రెండో తేదీ నుంచి మే 8వ తేదీ వరకు కెసిఆర్ ఢిల్లీలోనే ఉంటారని, మే 4వ తేదీన ఢిల్లీ లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కెసిఆర్ ప్రారంభిస్తారని సమాచారం.

ఇక బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ వివిధ పార్టీల నాయకులతో నాలుగైదు రోజుల పాటు వరుసగా భేటీ కానున్నారు.బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యకలాపాలన్నీ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం కేంద్రంగా ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రంగా ఎటువంటి యాక్టివిటీస్ జరగలేదు. ఇక తాజాగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించిన తర్వాత కెసిఆర్ పూర్తిస్థాయిలో దేశ రాజకీయాల పైన ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశరాజకీయాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో కెసిఆర్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో పార్టీ కార్యకలాపాలను ఉదృతం చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దేశంలో ఏ రాష్ట్రాలలో పార్టీని ఏ విధంగా విస్తరించాలి? ఎక్కడ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి? పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీలో చేరికలపై ఎలా ముందుకు వెళ్లాలి? వంటి అంశాలపై కెసిఆర్ ఢిల్లీ కేంద్రంగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక మే నెలలో జరగనున్న పర్యటనలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులతో భేటీ కానున్నారు. కొన్ని రహస్య భేటీలు కూడా జరగనున్నాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. సమాజ్వాదీ, ఆర్జెడి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. బిజెపిలో మంత్రిగా పనిచేసిన ఢిల్లీకి చెందిన ఒక నేతతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు అని సమాచారం. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం విషయంలో కూడా కెసిఆర్ ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications