ఈసారి చంద్రబాబు బాధ్యత మీదే, జాగ్రత్త.. ఈసారి వదలం, అన్నీ కనిపెడుతున్నా: కేసీఆర్
Recommended Video

వరంగల్/హైదరాబాద్: తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకు తాము అభివృద్ధి పైనే దృష్టి సారించామని, ఈసారి అధికారంలోకి వచ్చాక గతంలో కాంగ్రెస్ నేతలు హౌసింగ్‌లో పాల్పడిన అక్రమాలపై దృష్టి సారిస్తామని, ఎవరినీ వదిలే సమస్య లేదని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. నర్సంపేటలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దేశంలో ఇంకా చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికలు అనగానే ఆందోళన చెందవద్దని, ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఓవైపు, 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన తెరాస ఉందని, అభివృద్ధి, చరిత్ర మీ ముందు ఉందని కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. విద్యుత్ తలసరి వినియోగంలో మనం ముందున్నామని చెప్పారు.

చంద్రబాబు మళ్లీ వచ్చే ప్రయత్నాలు
నాయకులు వస్తుంటారు, పోతుంటారని, కానీ రాష్ట్రానికి ఏది క్షేమమో జనాలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని చెప్పారని అన్నారు. ఇప్పుడు అదే ఆంధ్రా నేత, ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఇక్కడకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సమైక్య పాలకుల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పాలన ఉందన్నారు.

చంద్రబాబు గురించి మనకు తెలియదా
చంద్రబాబు ఏపీకి వెళ్లిన తర్వాత కూడా మన వెంట పెడుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా చంద్రబాబు పరిపాలన అవసరమా అన్నారు. కత్తి ఆంధ్రోడు తెస్తే, పొడిచేవాడు తెలంగాణవాడు అయితాడని తాను గతంలో ఉద్యమం సమయంలోనే చెప్పానని, ఇప్పుడూ అదే జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు చంద్రబాబును తీసుకొస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి మనకు తెలియదా అన్నారు. మన ప్రాజెక్టులు పూర్తి కానివ్వడం లేదని, అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్నికొడతానని చెబుతున్నాడని, మనల్ని కొట్టి ఓటు అడిగే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్ము కక్కిస్తాం
గత ప్రభుత్వాలకు, తెరాస పాలనకు తేడాను ప్రజలు గుర్తించాలని కేసీఆర్ చెప్పారు. కళ్యాణలక్ష్మి వంటి పథకం వస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. రైతు బంధులాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఐక్య రాజ్య సమితి గుర్తించిన పది అత్యుత్తమ పథకాల్లో రైతు బంధు ఉందని చెప్పారు. ఈసారి తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు హౌసింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

మోడీకి ఆ జబ్బు ఉంది
ఒకటి విజయవాడ గులాం పార్టీ (టీడీపీ), మరొకటి ఢిల్లీ గులాం పార్టీ (కాంగ్రెస్) అని కేసీఆర్ చెప్పారు. తమకు బాస్‌లు ప్రజలే అన్నారు. రాష్ట్రానికి ఏది క్షేమమో ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. 2 లక్షల 68వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని, కట్టి తీరుతామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ బీమారీ ఉందని, ఆ జబ్బు హిందూ, ముస్లీంలను వేరుగా చూడటం అని కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలు మనమే గెలవాలన్నారు.
చంద్రబాబును తరిమికొట్టే వంతు ఈసారి మీది
గతంలో ఓసారి చంద్రబాబును తరిమికొట్టడం తనవంతు అయిందని, ఈసారి ఆయనను తరిమికొట్టే బాధ్యత మీదే (ప్రజలు) అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మీ వంతు అన్నారు. ఇప్పుడు చంద్రబాబును మోసుకొస్తున్న వారిని కొట్టాలని, కొట్టాలి అంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అర్థమని చెప్పారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి గూండాలను, రౌడీలను పెంచిపోషించి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిసిందని, తస్మాత్ జాగ్రత్త అని, నేను హెచ్చరిస్తున్నానని, అన్నింటిని మేం ఓ కంట కనిపెడుతున్నామని నర్సంపేట సభలో కేసీఆర్ అన్నారు. గతంలో వదిలేశామని, కానీ ఇప్పుడు వదిలే సమస్య లేదని, ఒక్క దెబ్బ కొడితే ఆరు దెబ్బలు కొడతామన్నారు. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా నా ప్రాంతమేనని, అందర్నీ సమానంగా చూస్తున్నామని చెప్పారు. మీకు ఏమైనా అయితే నేను గద్దలా వాలిపోయి పోరాడుతానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలను తరిమి కొడదామన్నారు.












Click it and Unblock the Notifications