నా కండ్లల్ల నీళ్లు తిరిగాయ్: కేసీఆర్
హైదరాబాద్: అనాథ పిల్లలకు ఉన్నతస్థాయి విద్యనందించే లక్ష్యంతో పదో తరగతి తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం అనాథ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
అనంతరం తెలంగాణలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మ, నాన్న అవుతుందని కేసీఆర్ అన్నారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్న రాష్ట్రంలో అనాథ పిల్లలను ఆదుకోవడానికి ఏమీ చేయలేమా? ఎన్ని స్వచ్ఛంద సంస్ధలు అనాథల కోసం కృషి చేస్తున్నా సరిపోవడం లేదని ఆయన అన్నారు.
ఈ క్రమంలో మొట్టమొదటి స్కూల్‌ను యాదగిరి గుట్టలో ప్రారంభించాలని, దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో శంకుస్థాపన చేయించాలని ఆయన భావిస్తున్నారు. అనాథ పిల్లలపై తనకు మక్కువ పెరగడానికిగల నేపథ్యాన్ని ఆయన వివరించారు.
‘‘నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు ఇద్దరమ్మాయిలు గణితంలో ఏదడిగితే అది గటుక్కున చెబుతున్నరు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను కలిశారు.

వాళ్లిద్దరూ నా దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి... ‘సార్.. మేము పదో తరగతి చదువుతున్నాం. తర్వాత ఏంచేయాలో తెలీడంలేదు. మేము అనాథలం సార్. మాకెవరూ లేరు.' అన్నారు. మేము అనాథలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి రావడంతో నా కండ్లల్ల నీళ్లు తిరిగాయ్.
అంతమందిలో ఏడిస్తే బాగుండదని ఏడుపు ఆపుకున్న. కానీ ఆ పిల్లలే నా కండ్లల్ల మెదిలారు. కార్యక్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారే గుర్తుకొచ్చారు. అనాథలమని చెప్పుకునే పరిస్థితి రావడం నా మనసును కలచివేసింది.
అదే స్థితిలో మన పిల్లలుంటే.. అనే ఆలోచన రాగానే గుండె మరింత బరువెక్కింది.. అప్పుడే గట్టిగా అనుకున్న. తెలంగాణలోని అనాథ పిల్లలందరికీ ప్రభుత్వమే అమ్మానాన్న కావాలనుకున్న. అనాథ పిల్లలను ఆదుకోవడానికి ఏమీ చేయలేమా? అనే ఆలోచన కలిగింది.'' అని కేసీఆర్ వివరించారు.
అనాథ పిల్లలకు బంగారు భవిత అందించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాలని ఆదేశించారు. అనాథలకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని కొన్ని అనాథాశ్రమాలను సందర్శించి వారి స్ధితిగతులు తెలుసుకుంటానని అన్నారు.
రాష్ట్రంలో అనాథ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై చర్చించిన కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications