అప్పుడు కెసిఆర్ విద్యార్థి, నేను బుల్లెట్‌పై పోతుంటే చూస్తుండేవాడు: నాయిని
హైదరాబాద్: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురించి తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మొదటిసారి తాను ఎమ్మెల్యేను అయినప్పుడు కెసిఆర్ చదువుకుంటేవారని, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తాను బుల్లెట్‌పై పోతుంటే తనను చూస్తుండేవారని ఆయన చెప్పారు.
ఇప్పుడైతే కెసిఆరే తమకు నాయకుడని, తెలంగాణ రాష్ట్రం పట్ల కెసిఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి వల్లనే తాను వెంట నడిచానని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఆదివాసీ గిరిజన దినోత్సవ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు.

గిరిజనులు ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమేనని, వారంతా బాగుపడాలంటే ఐకమత్యంతో ఉద్యమించాలని ఆయన చెప్పారు. 1969 ఉద్యమంలో ముప్పై సార్లు తాను జైలుకు వెళ్లినట్లు తెలిపారు. మలి దశ ఉద్యమంలో కెసిఆర్ తనకు ఫోన్ చేసి తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తున్నానని చెప్పారని, మీతో మాట్లాడాలి... రమ్మంటారా అని అడిగితే తానే వస్తానని చెప్పానని, పద్నాలుగేళ్లుగా కెసిఆర్‌తో తాను కలిసి నడుస్తున్నానని నాయని వివరించారు.
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇద్దామంటే 9 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయని, అదే జరిగితే కాంగ్రెసు గగ్గోలు పెడుతుందని, అందుకే ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications