గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం: కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గత ప్రభుత్వం(బీఆర్ఎస్ సర్కారు) ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ(దాసోజు శ్రవణ్, సత్యనారాయణ) ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల విచారణ అర్హతపై జనవరి 24న హైకోర్టులో విచారణ జరగనుంది.

అయితే, ఆ రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికను నిలిపివేస్తూ.. ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు.
రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతోపాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ భవన్ పేర్కొన్నాయి. కాగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వంలో ఉండటంతో గవర్నర్ కోటా సీట్లతో కలిపి మొత్తం నాలుగు సీట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.












Click it and Unblock the Notifications