త్వరలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. అసెంబ్లీ కీలక ప్రకటన.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై కీలక అప్డేట్ వచ్చింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గెజిట్ జారీ చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సెప్టెంబర్ 26వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉప ఎన్నిక కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన దానం నాగేందర్ కు చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
తాజాగా అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. ఇక ఈ అసెంబ్లీపై ఎన్నికల సంఘం త్వరలోనే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన క్రమంలో హైదరాబాద్ లో మరోసారి అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్- ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల మాదిరిగానే బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా..? లేక అధాకార కాంగ్రెస్ ను విజయం వరిస్తుందా..? వేచి చూడాల్సిన అవసరం ఉంది.

మరోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికపై మాజీమంత్రి దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని, రాబోయే ఉపఎన్నికలో ఊహించని రీతిలో ఘనవిజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో దిమ్మతిరిగే ఫలితం వస్తుందని.. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలా ఉంటుందని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి SIR, ఇతర రాజకీయ ప్రభావం చూపలేవని తెలిపారు.












Click it and Unblock the Notifications
