కేసీఆర్ గారు.. ఇది రాజకీయ కుట్ర అయితే రైతుల అరెస్టులేమిటి?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'అన్నదాత చల్లగా ఉంటేనే తెలంగాణ పచ్చగా ఉంటుంది.. మా సర్కార్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. కర్షకుల కోసం గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధానాలను మేం అమలు చేస్తున్నాం'' ఈ నినాదాలు.. వ్యాఖ్యలు ఎవరివో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు సందర్భాల్లో చేసినవి.

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళనకు ముందు రోజు వరంగల్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ ప్రగతి నివేదనా సభలోనూ రైతు సంక్షేమానికి ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఎరువుల కోసం రూ.8,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. కానీ ఖమ్మం మార్కెట్ యార్డులో కనీస ధర రాక నిరసన చేపట్టిన అన్నదాతల ఆందోళనపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రైతుల సంక్షేమం పట్ల అనుసరిస్తున్న సంక్షేమ విధానంలో డొల్లతనం బయట పడింది.

అరాచక శక్తులే మార్కెట్‌లో విధ్వంసం నెలకొల్పాయని ఇదే కుట్ర అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. కానీ ఆచరణలో ఆయన సర్కార్, పోలీసులు అనుసరిస్తున్న తీరు వాస్తవాన్ని బయటపెట్టాయి. ఖమ్మం జిల్లా పోలీసులు పది మంది రైతులపై ఐపీసీలోని తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

మార్కెట్‌కు రైతుల రాకే నేరమా?

మార్కెట్‌కు రైతుల రాకే నేరమా?

ఏ 2 నిందితుడిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరు పెట్టినా ప్రధాన నిందితుడు ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామ వాసి మండెపూడి ఆనందరావు 11 ఎకరాల రైతు. మరో నాలుగు ఎకరకాలు కౌలుకు తీసుకున్న ఆశాజీవి. ఆయనతోపాటు వారిలో ఆరుగురు అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలే కావడం గమనార్హం. సమస్య పరిష్కారంపై ద్రుష్టి సారించలేని ప్రభుత్వం దానిని తప్పుదోవ పట్టించేందుకు రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చిన పాపానికి జైలుకు పంపడం న్యాయమా? అని బాధిత రైతుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి బదులు.. నిఘా వర్గాలు, పోలీసులు, సివిల్ అధికారులతోపాటు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల సలహాలు, సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైతే రైతులే కాదు మిగతా వర్గాలకు ఇదే పరిస్థితి దాపురిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మిగతా రైతులతో గొంతు కలిపినందుకు..

మిగతా రైతులతో గొంతు కలిపినందుకు..

ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామవాసి ఎం ఆనందరావు 11 ఎకరాల భూమికి ఆసామి. కౌలుకు తీసుకున్న మరో 4 ఎకరాల భూమిలో మిర్చి పంట సాగుచేశాడు. మిగతా భూమిలో కంది, మొక్కజొన్న, వరి సాగు చేశాడు. గతనెల 28వ తేదీన ట్రాక్టర్‌పై మిర్చి బస్తాలను తీసుకుని ఖమ్మం మార్కెట్ యార్డుకు వచ్చాడు. మొత్తం 65 బస్తాల పంటను ఇంకా కిందకు దించనేలేదు. ఇంతలో అక్కడ వాతావరణం వేడెక్కింది. మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతుంటే వారితో జత కలిశాడు. అంతకు ముందు రోజే జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో మద్దతు ధర కోసం ఎవరినైనా ప్రశ్నించొచ్చన్న సీఎం కేసీఆర్ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఇంకేముంది మిగతా రైతులతో కలిసి తాను గొంతు కలపడమే మొదటికి మోసం తెచ్చింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా పరిగణించి, జైలుకు తరలించారు. గ్రామంలో తమ కుటుంబం గౌరవంగా బతికిందని, ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటామని ఊహించలేదనీ అతని భార్య విజయమ్మ కన్నీటిపర్యంతమైంది.

మద్దతు ధర కోరితే కేసు నమోదు

మద్దతు ధర కోరితే కేసు నమోదు

అదే ముదిగొండ మండలం బాణాపురం గ్రామవాసి నెల్లూరి వెంకటేశ్వర్లు తనకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఐదెకరాల భూమిలో నాలుగెకరాల్లో మిర్చి, ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. 70 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తెచ్చాడు. మద్దతు ధర కోసం జరిగే ఆందోళనలో పాల్గొన్న పాపానికి అతడిపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపడంతో భార్య తులసి చిన్నారి బిడ్డతోపాటు.. వెంకటేశ్వర్లు తల్లి లలితమ్మలు ఆగలేక జైలు వద్దకు వెళ్లారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో కళకళలాడే ఇల్లు రైతులేకపోవడంతో కళా హీనంగా మారింది. ఆ చిన్నారి నాన్న కోసం గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆగలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా కల్లూరు వాసి ఇస్లావత్ బాలాజీ అనాదిగా రెండెకరాల భూమి సాగుచేస్తూ జీవిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సత్తు కొండయ్య తొమ్మిదెకరాల కౌలు రైతు. 77 బస్తాల మిర్చిని మార్కెట్‌కు బస్తాలు వేసుకొచ్చిన రైతు అనుకోకుండా జైలుకు పోయాడు. ఇప్పుడు కుటుంబ పెద్ద జైలుకుపోవడంతో కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు.

నాలుగు లక్షల అప్పు తీరేదెలా?

నాలుగు లక్షల అప్పు తీరేదెలా?

కారేపల్లి మండలం దుబ్బతండా రైతు తేజావత్‌ భావ్‌సింగ్‌ కూడా అధికార పార్టీ సభ్యుడే. ఆయన తన నాలుగెకరాల భూమిలో మిర్చి పంట సాగు చేస్తుంటాడు. ఈసారి చేతికొచ్చిన 50 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తీసుకొచ్చి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. ఆందోళనకరమైన విషయమైమింటే భావ్ సింగ్ భార్య కల్యాణి నిండు గర్భిణి కావడమే. మిర్చి కోసం నాలుగు లక్షల రూపాయలు అప్పు తీసుకొస్తే తీరా మార్కెట్ కు తరలించిన మిర్చి ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నామని భావ్ సింగ్ తల్లిదండ్రులు పద్మ, శ్రీరాములు గొల్లుమన్నారు. ఏన్కూర్ మండలం శ్రీంపురం తండా భూక్యా నర్సింహారావు మార్కెట్‌లో ఆందోళన సంగతే తెలియదాయనకు. మిర్చి కొనకపోవడంతో ఇంటికి తేవడానికి ముందు మార్కెట్ వద్దకు వెళ్లిన పాపానికి తన భర్తను కూడా కేసులో ఇరికించారని నర్సింహారావు భార్య జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్ కు తెచ్చిన మిర్చి ఏమైందోనని ఆందోళన

మార్కెట్ కు తెచ్చిన మిర్చి ఏమైందోనని ఆందోళన

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలోని గిరిజన రైతు బాణోతు ఉపేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌ సభ్యుడే. తన నాలుగెకరాల భూమిలో మిర్చి, పత్తి, శనగ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతేడాది మిర్చికి మంచి గిరాకీ ఉండటంతో.. ఈసారి కూడా అందిన కాడికి అప్పు తెచ్చి ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాడు. 24బస్తాల మిర్చిని మార్కెట్‌కు తెచ్చాడు. క్వింటా రూ.3వేలకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేక రెండ్రోజులు అక్కడే ఉన్నాడు. దీంతో ఉపేందర్‌పైనా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యవసాయం కసం రూ.1.50 లక్షలు అప్పు చేశామని, మార్కెట్ కు తీసుకెళ్లిన మిర్చి ఎక్కడుందో తెలియక ఆగమవుతున్నామని ఉపేందర్ తల్లి చాలీ, భార్య లలిత వాపోతున్నారు.

ఇతరుల వల్లే మార్కెట్ యార్డులో విధ్వంసమన్న తుమ్మల

ఇతరుల వల్లే మార్కెట్ యార్డులో విధ్వంసమన్న తుమ్మల

తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామ గిరిజన రైతులు బాణోత్‌ సైదులు, భూక్యాశ్రీను మార్కెట్‌ దాడి కేసులో జైలుకెళ్లడంతో వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. రెక్కాడితేకాని డొక్కాడే పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మార్కెట్‌కు మిర్చిని అమ్మకానికి తెచ్చి వారు ఈ కేసులో జైలుకు వెళ్లారు. దీనికి తోడు అమ్మకానికి తెచ్చిన మిర్చి ఎక్కడున్నదీ వారి కుటుంబీకులకు తెలియక అవస్థల పాలవుతున్నారు. కానీ ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాత్రం రైతులు ఆందోళనకు దిగలేదని, ఇతరుల పనేనని పేర్కొన్నారు. ఆందోళనకారులపై తప్పనిసరి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ఆరోపణలు ఆయన విజ్నతకే వదిలేస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సగం మంది టీఆర్ఎస్ సభ్యులేనని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Khammam Police acted seriously on Mirchi agitation in market yard in dist head quarter but half of accused members are farmers and TRS activists.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి