రాత్రికి రాత్రి పెను మార్పు: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కీలక బాధ్యతలు: రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు
హైదరాబాద్: దేశ రాజధానిలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కీలక బాధ్యతలను అందుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు కొనసాగుతోన్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార పార్టీ ఒత్తిళ్లే దీనికి కారణం కావడం మరో అనూహ్య మలుపుగా భావిస్తున్నారు.

తమిళిసైకి అదనపు బాధ్యతలు..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా కొనసాగిన డాక్టర్ కిరణ్ బేడిని తొలగించింది. ఆమెకు ఉద్వాసన పలికింది. కిరణ్ బేడి స్థానంలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.

కాంగ్రెస్ ఫిర్యాదుల మేరకు
పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. మరో ఒకట్రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కిరణ్ బేడి.. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపణలను చేస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఫిర్యాదు చేసింది. వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. కిరణ్ బేడిని తొలగించింది.

స్వాగతించిన నారాయణ స్వామి..
కిరణ్ బేడి తొలగింపును ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కిరణ్ బేడి ద్వారా బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపణలను చేశారు. ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడానికి కిరణ్ బేడి విశ్వ ప్రయత్నాలు చేశారంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ఏపీలోని యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా వ్యవహారం తెర మీదికి రావడానికి కూడా బీజేపీ కారణమని ధ్వజమెత్తారు.

పుదుచ్చేరిలో అధికారంలోకి రావడానికి..
పుదుచ్చేరిలో అడ్డదారిలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, కుట్రపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తోందని నారాయణ స్వామి మండిపడ్డారు. దీనికి లెప్టినెంట్ గవర్నర్ వ్యవస్థను అడ్డగోలుగా వినియోగించుకుంటోందని ఆరోపించారు. తమిళనాడు, కేరళలల్లో అధికారంలోకి రాలేమని తేలిపోయిన తరువాత.. పుదుచ్చేరిపై బీజేపీ కన్నేసిందని విమర్శించారు. బీజేపీ కుట్రలను తాము సమర్థవంతంగా ఛేదించినట్టయిందని ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications