140 కోట్ల మంది ప్రజల మద్దతుతో గెలిచేది ఆయనే: కిషన్ రెడ్డి
దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి, మతకల్లోలాలే ఉంటాయన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దేశానికి సుస్థిరమైన పాలన అందించడానికి నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన జీప్ యాత్ర చేపట్టారు. ఈ లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తమ విలువైన ఓటు హక్కును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని హితవు పలికారు కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదించాలన్నారు. ఆయనను ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజల మద్దతుతో గెలిచేది ప్రధాని నరేంద్ర మోడీనేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడంలో మోడీ కృషి ఎనలేనిదని అన్నారు.

ప్రపంచంలో భారతదేశం అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కరోనా సమయంలో భారతదేశం అతలాకుతలం అవుతుందని ప్రగల్బాలు పలికిన ప్రపంచ దేశాలు మాటలకు... వ్యాక్సిన్ ద్వారా ధీటైన సమాధానం చెప్పారని గుర్తు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, కుటుంబ పాలన, కర్ఫ్యూ, కరెంటు కోత, నీటి కొరత రావడం సత్యమని కిషన్ రెడ్డి విమర్శించారు. సుస్థిరమైన పాలనను అందిస్తున్న మోడీనే యావత్ దేశ ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన హమీల అమలు ఎటు పోయిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజలను గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలనే అమలు చేయలేదని, దేశవ్యాప్తంగా అమలు కోసం మరిన్ని హామీలు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. వంద రోజులు పూర్తయినా, ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.












Click it and Unblock the Notifications