నిజాంలా కేసీఆర్ తర్వాత కుమారుడు! అసహ్యించుకుంటున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: హుజురాబాద్ ఫలితాలతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఎవరు వ్యతిరేకించినా కేసీఆర్ సహించడం లేదన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్ వ్యవహార శైలిని అసహ్యించుకుంటున్నారు: కిషన్ రెడ్డి
కేసీఆర్ వ్యవహార శైలిని తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉందన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్తాయి వ్యక్తి ఇంత దిగజారుతాడా? అని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని తగ్గించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. తనను ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.

కేసీఆర్ విషం కక్కుతున్నారు: కిషన్ రెడ్డి ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానించేలా కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు.
ప్రధాని మోడీ, బీజేపీపై కేసీఆర్ అవాస్తవాలతో విషం కక్కుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రానికి, బీజేపీకి ఎవరూ శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయన్నారు. అమరుల ఆత్మ ఘోషించేలా.. భారత సైనికుల స్థైర్యం దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నిజాం తరహాలో కేసీఆర్ తర్వాత కుమారుడు..: కిషన్ రెడ్డి
భారత జవాన్ల దాడిలో పాక్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. తమ స్థావరాల ధ్వంసాన్ని పాక్ ఉగ్రవాదులూ అంగీకరించారు. తండ్రి తర్వాత కుమారుడు పాలించేలా నిజాం తరహాలో రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. నిజాం పరిపాలనలా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడన్నారు. మోడీ ప్రభుత్వం ఏడేళ్లపాలనపై కేసీఆర్ చర్చకు సిద్ధం, సీఎం కేసీఆర్ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నా.. సీనియర్ పాత్రికేయుల సమక్షంలో గన్ పార్క్ వద్దకు రావాలి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. కానీ, ప్రజలు మాట్లాడే భాషతోనే చర్చకు సిద్ధమన్నారు.

బీజేపీకి దేశమే ముఖ్యం: కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ప్రతి సవాల్
మా పార్టీకి దేశమే ముఖ్యం..వ్యక్తులు కానీ కుటుంబాలు ముఖ్యం కాదన్నారు. టీఆర్ఎస్‌కు కుటుంబం, అధికారం ముఖ్యం అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీని తరిమికొట్టే శక్తి ఈ భూ ప్రపంచంలోనే ఎవరికీ లేదన్నారు. తెలంగాణ నిర్ణయాలన్నీ కేసీఆర్ డైనింగ్ టేబుల్ పై జరుగుతాయి, కానీ కేబినెట్‌లో కాదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. కొన్ని సంఘటనలు జరిగితే చేతులు ముడుచుకుని కూర్చోబోమన్నారు. బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదన్నారు. కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. యూరియా మీద వందకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. త్వరలోనే రామగుండం యూరియా ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి తెలిపారు.