యూపీలో విషాదం : కడుతుండగానే కుప్పకూలిన బ్రిడ్జి.. ఆరుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో అప్పుడే నిర్మాణంలో ఉన్న బెట్వా నది వంతెన కూలి పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హమీర్‌పూర్‌లోని కురారా పోలీస్ స్టేషన్ పరిధిలో మోర్కందర్ పర్సాని నుంచి నైతి గ్రామం వరకు ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. గురువారం (మే 28) రాత్రి కార్మికులు యథావిధిగా పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు తీవ్రమైన తుఫానుతో పాటు బలంగా వీచిన ఈదురు గాలుల ధాటికి వంతెన కుప్పకూలింది.

కాగా ఈదురు గాలుల ధాటికి భారీ షట్టరింగ్, స్లాబ్‌లు, పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాద సమయంలో వంతెన కింద పనిచేస్తున్న కార్మికులపై భారీ కాంక్రీట్ శిథిలాలు పడటంతో వారు బయటకు రాలేక, అక్కడికక్కడే చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
చీకటి, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలు ప్రారంభంలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ, అధికారులు రాత్రంతా శ్రమించి జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో గాయపడిన మరికొందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో, రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడంతో పాటు, బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications