కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన అంతానికి అమిత్ షా పిలుపు: కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి, బీజేసీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్ పాలన.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది: కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో తాము రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవలేదని అన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి తరలించాలని అన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి, వరదలకు కొట్టుకుని పోయిందని మండిపడ్డారు. దీంతో రైతులు నష్టపోయారన్నారు. అన్ని పార్టీలు రైతులకు అనుకూలంగా ఉండాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు: కిషన్ రెడ్డి
కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రాష్ట్రమంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారని.. అది ఎన్నటికీ జరగబోదని అన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ కుటుంబాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంటింటికి డబ్బులు పంపించినా గ్రేటర్ లో గెలవలేకపోయారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేశారని, అయితే ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు కిషన్ రెడ్డి.

కేసీఆర్ అవినీతి పాలన అంతానికి అమిత్ షా పిలుపు: కిషన్ రెడ్డి
శనివారంనాటి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ సభలో అమిత్ స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారని చెప్పారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications