ఆర్ఆర్ఆర్ గేమ్ ఛేంజర్! సికింద్రాబాద్ మోడీ సభతో పెను మార్పులు: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్, బీఆర్ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండేది ఇంకా ఆరు నెలలేనన్నారు. బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. అధికారంలో ఎవరున్నా అభివృద్ధిని ఆపొద్దని సూచించారు.
ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రధాని మోడీ సభతో పెను మార్పులుంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రూ. 1400 కోట్లతో జరిగిన డబ్లింగ్ పనులను మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. రూ. 7764 కోట్లతో చేపట్టే నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారని తెలిపారు. రూ. 1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులను మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్ ను ప్రజలకు అంకితం చేస్తారన్నారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలు నడపాలని రైల్వే శాఖను కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిలో(రీజినల్ రింగ్ రోడ్డు) ఆర్ఆర్ఆర్ గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే అన్ని రకాలుగా హైదరాబాద్ అభివృద్ధికి వీలుంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. రూ. 4వేల అంచనా వ్యయం రూపొందించినట్లు చెప్పారు. భూసేకరణ కోసం 50 శాతం నిధులు, రోడ్డు నిర్మాణ పనుల వ్యయం కేంద్రమే భరిస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
తిరుపతికి పర్యాటకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారిన తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడకపోవడంతో రెండో ఫేజ్ ఆలస్యమైందన్నారు. ట్రాఫిక్, ప్రజల సౌకర్యం కోసం ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రులు అంబర్‌పేట ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ బ్రిడ్జి పూర్తి చేయడం లేదని విమర్శిస్తున్నారని.. అయితే, ఈ రెండు ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలిపారు.
ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వరకు తెలంగాణలోనే మొదటి సిమెంట్ రోడ్డు వేశామని చెప్పారు. అధికారంలో ఉండే ఆరు నెలలైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించాలని కోరారు. దేశ రాజకీయాల కోసం వెచ్చించేందుకు కేసీఆర్‌కు రూ. లక్ష కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. మోడీ పర్యటనలో పాల్గొనాలని ప్రధాని కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపామని, సీఎం రావాలని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications