kodad: సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉండే కోదాడలో విజయం వరించేది ఎవరినంటే!!
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గం అయిన కోదాడలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్లు పెద్ద సంఖ్యలో వుండటంతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అన్నది తెలియాల్సి ఉంది.
కోదాడలో సెటిలర్స్ మద్దతు అభ్యర్ధుల జయాపజయాలను నిర్ణయించేదిగా ఉంటుంది. 2 లక్షల 41 వేల మంది పైగా వున్న ఓటర్లలో 8 వేల 700 మంది పైగా కొత్త ఓటర్లు కూడా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చే అవకాశం వుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సంస్కృతుల మేలుకలయిక కోదాడలో కనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి నల్లమాద పద్మావతి విజయం సాధించారు.

అయితే గత ఎన్నికలో కోదాడ అధికార BRS వశమైంది. సిట్టింగ్ BRS అభ్యర్ధి బొల్లం మల్లయ్యయాదవ్ కు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బరిలో దిగిన ఉత్తమ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గట్టి పోటీ ఇస్తుండగా, కోదాడ నుంచి CPM అభ్యర్ధి మట్టిపల్లి సైదులు, బీజేపీతో పొత్తులో భాగంగా బరిలోకి దిగిన జనసేన అభ్యర్ధి మేకల సతీష్ తమ గెలుపు కోసం గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
మాజీ TDP శాసనసభ్యుడు వి.చందర్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి, పద్మావతి తరఫున ప్రచారం చేస్తుండటంతో, స్థానికంగా రాజకీయ సమీకరణల్లో మార్పులొచ్చాయి. స్థానిక టిడిపితో పాటు TJS అధ్యక్షుడు కోదండరామ్ కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు పలకడంతో తన విజయ అవకాశాలు మెరుగుపడ్డాయని పద్మావతి భావిస్తున్నారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో తనకు మద్దతు కూడగడతాయని సిట్టింగ్ BRS అభ్యర్ధి మల్లయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే BRS అధ్యక్షుడు KCR నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. మరోవైపు CPM అభ్యర్ధి సైదులుకు మద్దతుగా కమ్యూనిస్టు నాయకులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.జనసేన అభ్యర్ధి తరఫున ఆ పార్టీ నాయకులతో పాటు, బిజెపి కూడా ప్రచారం సాగిస్తోంది. మొత్తం 34 మంది అభ్యర్ధులు బరిలో నిలవడంతో కోదాడపై విజయం ఎవరిని వరిస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications