కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యతనిస్తూ కీలక పదవి కట్టబెట్టిన బీజేపీ
హైదరాబాద్: బీజేపీపై కొంత అసంతృప్తిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇప్పటికీ పలు కీలక మార్పులు చేసింది బీజేపీ. తాజాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.
రాజగోపాల్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా చేరికల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఇప్పటికే అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.

బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాయతీ కార్యవర్గ సభ్యుడిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి.. ఈ కొత్త నియామకం తర్వాత మళ్లీ యాక్టివ్‌గా మారతారని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. కొత్త నియామకంపై కోమటిరెడ్డి స్పందించాల్సి ఉంది.
పొంగులేటిని కలిసిన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది.
రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా, కొంత కాలంగా క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడంతో ఆ ప్రచారానికి బలాన్నిచ్చినట్లయింది. అయితే, తాజాగా బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఓ కార్యక్రమంలోనే పొంగులేటిని కలిసినట్లు కోమటిరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications