కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంప మునిగిందిగా!!
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. నవంబరు మూడోతేదీన పోలింగ్ జరగనుంది. ఆరోతేదీన ఫలితాలు విడుదలవుతాయి. సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ రెండు పార్టీలకన్నా, అభ్యర్థులకన్నా భారతీయ జనతాపార్టీకి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నిక నిలవబోతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, నిలువెత్తు అహంకారంతో బైపోల్ తెచ్చారంటూ కేటీఆర్ మండిపడుతున్నారు.

రాజగోపాల్ రెడ్డికి షాకుల మీద షాకులు
పార్టీ మారి సీటు సంపాదించి రంగంలోకి దిగిన కోమటిరెడ్డికి మొదట్లోనే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ మారుతున్నాను.. అందరూ సహకరించాలంటూ నియోజకవర్గ పరిధిలోని నాయకులందరి దగ్గర హామీ తీసుకొని బరిలోకి దిగితే కొంతమంది కోమటిరెడ్డికి హ్యాండిస్తున్నారు. అంతేకాదు మరికొందరు అధికార పార్టీలో చేరగా, ఇంకొందరు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి కోమటిరెడ్డి చేరారు. తాజాగా నియోజకవర్గంలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన రాజగోపాల్ రెడ్డికి ఇంకోరూపంలో గట్టి షాక్ తగిలింది.

కచ్చితంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తాం?
ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా, ఎవరికి పలకరించినా అయ్యో.. కాంగ్రెస్ పార్టీ నాయకుడివి.. నీకు కాకుండా వేరేవారికి ఎలా వేస్తామయ్యా.. కచ్చితంగా కాంగ్రెస్ కే ఓటువేస్తామని చెబుతున్నారు. పచ్చి వెలక్కాయ నోటిలో అడ్డంపడినట్లవుతోంది కోమటిరెడ్డికి. దారిలో ఎవరు కనపడినా ప్రచారంలో భాగంగా ఓట్లడుగుతారు. ఇలా ఓట్లడిగినవారంతా కచ్చితంగా వేస్తాం.. కాంగ్రెస్ గురించి నువ్వు మాకు చెప్పడమేందయ్యా.. అంటున్నారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ నేతేగా.. మాకెందుకు తెలీదు.. అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారనే విషయం గ్రామీణ ప్రాంత ఓటర్లలోకి బాగా వెళ్లలేదని దీంతో స్పష్టమవుతోంది. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

తీవ్ర ఒత్తిడిలో రాజగోపాల్ రెడ్డి!
కోమటిరెడ్డి అంత ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రత్యేక కారణం.. కోమటిరెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ఓటర్లు భావిస్తున్నారు. ఈ విషయంలో భారతీయ జనతాపార్టీ నేతలకు ఒక స్పష్టత వచ్చింది. పోలింగ్ రోజు వీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు అని. వెంటనే కోమటిరెడ్డి టీం దిద్దుబాటు చర్యలకు దిగింది. పాంప్లేట్లు వేయడం, పోస్టర్లు, బ్యానర్లు కట్టడంతోపాటు ఇంటింటికీ తిరిగి కోమటిరెడ్డి బీజేపీలో చేరారు అనే విషయాన్ని కూడా ప్రచారం చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications