ప్రాణహాని ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటీషన్: భద్రతపై హైకోర్టు ఏం చెప్పిందంటే!!
బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. పోలీసులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఆయన విజ్ఞప్తి చేశారు.
గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలలో హోరాహోరీగా అధికార పార్టీతో పోరాడారు. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం పాలయ్యారు. మునుగోడు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10000 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అధికార దుర్వినియోగంతో బీఆర్ఎస్ విజయం సాధించిందని, నైతిక విజయం తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడు సంచలన ఆరోపణలు చేశారు.

ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అటు ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్ ను నిలదీస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక ఈ క్రమంలో తాజాగా ఆయన తనకు ప్రాణహాని ఉందని కోర్టు మెట్లు ఎక్కడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తుంది ఎవరు అని అంతా చర్చిస్తున్నారు. కాగా కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. నేడు వాదనలు విన్న న్యాయస్థానం రెండు వారాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆదేశం జారీ చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2 + 2 సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డిజిపికి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications