
కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చెయ్యరు.. కానీ చచ్చేదాకా కాంగ్రెస్ లోనే.. ఏంటిది కోమటిరెడ్డి బ్రదర్!!
కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీ శ్రేణులకు కూడా అంతుచిక్కకుండా ఉంది. మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో, మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యతను భుజాన వేసుకోవలసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచార పర్వానికి దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడనని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టిపిసిసి స్టార్ క్యాంపెయినర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మునుగోడులో పాల్వాయి స్రవంతి కోసం ప్రచారానికి రాని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతగా గట్టి పట్టున్న నాయకుడు. నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు నియోజకవర్గానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో పాటు, బీజేపీలో చేరారు. దీంతో అక్కడ మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సోదరుడు బీజేపీలో చేరినప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉన్న పాల్వాయి స్రవంతి కోసం ప్రచారం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు.

కుటుంబంతో ఆస్ట్రేలియాకు .. పార్టీ శ్రేణుల్లో చర్చ
ఎన్నికల ప్రచారం చేస్తారు అనుకుని అంతా భావిస్తే, అందుకు భిన్నంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈనెల 15వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉన్నారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమ్ముడు కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఈ తరహా చర్చ కొనసాగుతుండగా తాజాగా యాదాద్రి జిల్లా గుండాల మండలంలో వివిధ గ్రామల నుండి వివిధ పార్టీలకు చెందిన రెండు వందలమంది కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చచ్చే దాకా కాంగ్రెస్ లోనే ఉంటానంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చనిపోయే వరకు కాంగ్రేస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీలొనే ఉంటాడని తెలిపారు. తాను పార్టీ పదవిని మాత్రమే ఆశించానని , మంత్రి,ముఖ్యమంత్రి పదవులు నాకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ముందస్తుగా టికెట్లు ప్రకటించరని,సర్వే చేసి 6 నెలల ముందు టికెట్లు ప్రకటించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరు బయట ఉంటారో, ఎవరు లోపలికి వెళతారో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సంపదంతా కేసీఆర్ కుటుంబానికే సరిపోవడం లేదని, మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే పప్పు,బెల్లంలా పంచిపెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ లోనే ఉంటా.. కాంగ్రెస్ అభ్యర్థి కోసం పని చెయ్యను .. కోమటిరెడ్డి తీరుపై చర్చ
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 1000 దాటితే మొత్తం ఉచిత వైద్యం అందిస్తున్నారని, ఆరోగ్యశ్రీలో 1000 కోట్లు ప్రీమియం కడితే రాష్ట్రం మొత్తం ఉచిత వైద్యం ఇవ్వొచ్చని అన్నారు. అవసరం లేని కాళేశ్వరానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ,రైతులకు రుణ మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పనికిరాని మంత్రులు ఉన్నారని, 9 ఏండ్లల్లో నిజమైన పేదవానికి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేకపోయారని, 9 ఏండ్లలో రాష్ట్రంలో ఒక్క కొత్త డిఎస్సీ కూడా లేదని,కొత్త టీచర్ లేడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తాను చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత ఉంటే మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎందుకు ప్రచారం చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.