ముఖ్యమంత్రి పదవిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన, అనంతరం అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానని పేర్కొన్న ఆయన కానీ తనకు సీఎం కావాలని లేదంటూ వ్యాఖ్యానించారు.
నల్గొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల ఆదరణ చూస్తుంటే చర్మం గురించి చెప్పులు కుట్టించినా తక్కువేనంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పే బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ నాయకులు తామేదో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు ఎంతో మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా మొత్తాన్ని నాశనం చేశారని విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యే రోజు తనకు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని చెప్పిన ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఆత్మహత్యల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకాంతాచారి మరణిస్తే అతని కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ తో ఏమీ జరగలేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications