నాడు తాటికొండ రాజయ్య, నేడు కొండా సురేఖ.. అత్యంత అవమానకర బర్తరఫ్‌లతో ఓరు'ఘొల్లు'!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రులను తొలగించిన ఘటనలు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటివరకు అత్యంత అవమానకర రీతిలో జరిగిన బర్తరఫ్‌ల్లో తాటికొండ రాజయ్య, కొండా సురేఖ ఇద్దరి పేర్లు ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలే కావటంతో ఓరుగల్లులో చర్చ జరుగుతుంది. వరంగల్ జిల్లా నేతలపైనే ఎందుకు ఇంత దారుణ బర్తరఫ్ లు అని భావిస్తున్న వారు లేకపోలేదు.
2014లో తెలంగాణ అవతరణతో కేసీఆర్ ప్రభుత్వంలో తొలి డిప్యూటీ సీఎంగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాటికొండ రాజయ్యను 2015 జనవరి 25న అకస్మాత్తుగా బర్తరఫ్ చేశారు. స్వైన్ ఫ్లూ నిర్వహణలో లోపాలు, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు కారణంగా చూపించినా, ఆ తొలగింపు విధానం అత్యంత అవమానకరంగా జరిగిందని చర్చ సాగింది. వరంగల్ ప్రాంతం నుంచి ఇచ్చిన డిప్యూటీ సీఎంను ఒక్కసారిగా పక్కన పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.

ఇప్పుడు అదే వరంగల్ నుంచి వచ్చిన మరో నాయకురాలు కొండా సురేఖపై ఇదే తరహా చర్య జరుగుతోంది. దేవాదాయ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆమెను వివరణ తీసుకోకుండా బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలు, పార్టీలో అంతర్గత వివాదాలు కారణంగా చూపించినా, ఆమె ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ "నా బర్తరఫ్ చెల్లదు" అంటూ బహిరంగంగా స్పందించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మంత్రి బర్తరఫ్‌ల్లో తాటికొండ రాజయ్య తర్వాత కొండా సురేఖది రెండో అత్యంత అవమానకర కేసుగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఇద్దరూ వరంగల్ ప్రాంతీయ నాయకులు కావడం, ఇద్దరి తొలగింపు కూడా అకస్మాత్తుగా, వివాదాస్పదంగా జరగడం గమనార్హం. ఒకరు డిప్యూటీ సీఎం స్థాయి నుంచి, మరొకరు మంత్రి స్థాయి నుంచి ఇలా తప్పుకోవాల్సి రావడం వరంగల్ రాజకీయాలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. వరంగల్ లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications