మాపై కోపాన్ని.. రైతులపై చూపొద్దు: ‘మేడిగడ్డ’పై రేవంత్ సర్కారుకు కేటీఆర్ కీలక సూచన
'మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను శుక్రవారం బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీని బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మేడిగడ్డకు సంబంధించి 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని కేటీఆర్ తెలిపారు. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడడం సరికాదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయి. సాగర్, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను తాము రాజకీయం చేయలేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దీని ద్వారా రూ. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదు. తమపై ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోండి. మేడిగడ్డను మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి, దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సాగునీరు లేక ఇప్పటికే కరీంనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. వానాకాలం లోగా రిపేర్లు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని రేవంత్ సర్కారును కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications