అటు మేడిగడ్డ.. ఇటు నల్గొండ: తెలంగాణలో నీటి మంటలు: పీక్స్‌లో పాలిటిక్స్
Chalo Nalgonda: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కయ్యానికి కాలు దువ్వాయి. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. నదీ జలాల అంశాలపై పరస్పరం సమరానికి సంసిద్ధం అయ్యాయి.
ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. గేరు మార్చింది. అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనుసరిసస్తోన్న విధానాలకు నిరసనంగా నల్గొండ గడ్డ మీద సమర శంఖారావాన్ని పూరించనుంది. ఈ సభలో పాల్గొనడానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు నల్లగొండకు బయలుదేరి వెళ్లారు.

ఈ సాయంత్రం నల్లగొండలో మా నీళ్లు మాకే పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇదే నినాదంతో భవిష్యత్తులో కృష్ణా జలాల కోసం పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు ఆ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో నీటి హక్కులు కృష్ణార్పణం అయ్యాయంటూ మండిపడుతున్నారు.
తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమని గుర్తు చేస్తోన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు రాజీపడలేదని, కాంగ్రెస్ సర్కార్ మాత్రం వెండి పల్లెంలో కృష్ణా నదీ జలాల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించిందంటూ ఆరోపిస్తోన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిందనే ఆందోళనను వ్యక్తం చేస్తోన్నారు.
జనవరి 17వ తేదీన జరిగిన భేటీలో ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రం పరిధిలోకి చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర తప్పిదంగా అభివర్ణిస్తోన్నారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ అనుసరిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలను ప్రతి గడపకూ తీసుకెళ్తామని తేల్చి చెబుతున్నారు.

అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహదేవపూర్ మండలం పరిధిలోని యల్లంపల్లి- మేడిగడ్డ మధ్య గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ బ్యారేజీని నిర్మించింది.
ఈ బ్యారేజీలో పగుళ్లు రావడం, గేట్లు కుంగిపోవడం వల్ల దీని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యక్షంగా దీన్ని తిలకించి.. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం 4 గంటల సమయంలో వారంతా బ్యారేజీకి చేరుకుంటారు.
ఒకేరోజున ఒకే అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు.. యుద్ధానికి దిగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పరోక్షంగా మొదలుపెట్టినట్టయింది ఈ రెండు పార్టీలు కూడా.












Click it and Unblock the Notifications