మీ చాయ్ పె చర్చ హామీలు ఏమయ్యాయ్
KTR: భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. రేవంత్ సర్కార్ పై ఘాటు విమర్శలు సంధించారు. ఛలో హైదరాబాద్ ఆందోళనకు తరలివస్తోన్న నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారని, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఆయన చేసిన ద్రోహాన్ని నిలదీయడానికి వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు.. గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా అని నిలదీశారు.
ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు.
యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్.. ఈ ఏడాదిన్నర కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమేనని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60,000 ఉద్యోగాలకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరని అన్నారు.
ఒకవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే, మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఛలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి వారి గొంతులు నొక్కలేరని, వెంటనే వారిని బేషరతుగా విడుదల చేసి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని అన్నారు
లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని అన్నారు.












Click it and Unblock the Notifications