KTR ఆ ఆశలు గల్లంతేనా!!
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ చక్రం తిప్పుతుందా ? త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందా? వచ్చే ఎన్నికల పైన గంపెడు ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశలు నెరవేరుతాయా? అంటే కష్టమే అన్న సమాధానం వస్తుంది.
కేటీఆర్ ఆశ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం లోక్సభ ఎన్నికల పైన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికి కానీ , ఇటు ఎన్డీఏ కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10 నుండి 12 స్థానాలు సంపాదిస్తే, కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.

కేటీఆర్ ఆలోచన అలా.. పార్టీ పరిస్థితి ఇలా
ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులతో కూడా చెబుతున్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తానే ఎంపీ అన్న విధంగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. అయితే ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులలో ఏ సమయంలో ఎవరు పార్టీ నుంచి జంప్ అంటారో అర్థం కావడం లేదు.
కేసులతో భయపడుతున్న బీఆర్ఎస్ నేతలు జంప్
ఒకపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అధినేత కెసిఆర్ కుమార్తె కవిత, ఒకపక్క ఈడి, మరోపక్క సిబిఐ విచారణలో తీహార్ జైల్లో పీకల లోతు కష్టాలలో మునిగిపోయింది. ఇక ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా వద్దా అని పార్టీలో ఉన్న నేతలంతా తర్జనభర్జన పడుతున్నారు. ఎవరికి ఏ పార్టీ వీలైతే ఆ పార్టీలోకి జంప్ అంటున్నారు.
నెల విడిచి సాము చేస్తున్న కేటీఆర్
ఇక ఇలాంటి పరిస్థితులలో కేటీఆర్ కోరుకున్నట్టు లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు సంపాదించడం బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమేనా అనే చర్చ జరుగుతుంది. వాస్తవాలను, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనించకుండా కేటీఆర్ నేల విడిచి సాము చేస్తున్నట్టు ఆయన ఆలోచనలతో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

అంతర్మధనంలో కేసీఆర్
తీవ్రమైన గడ్డు పరిస్థితిలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ అంతర్మధనంలో ఉన్నారు. ఇప్పటికే గతంలో మంత్రులుగా అవకాశం ఇచ్చిన, కీలక పదవులు కట్టబెట్టిన ఎంతోమంది ముఖ్య నేతలు కాంగ్రెస్, బిజెపిల బాట పడితే కొన్ని జిల్లాలలో పార్టీని నడిపించే కీలక నాయకులు లేక గులాబీ అధినేత మదనపడుతున్నారు.
కేటీఆర్ ఆశలు అడియాశలే
పరిస్థితులు ఇలా ఉంటే కేటీఆర్ లోక్ సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాల పైన పెట్టుకున్న ఆశలు అడియాశలే అవుతాయని, కేటీఆర్ ఊహించినంత ఈజీ టాస్క్ ఇది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు పార్టీ ఉనికి కష్టమే అన్న ధోరణిలో పార్టీ శ్రేణులు ఉంటే కేటీఆర్ పార్టీ బానే ఉంది అన్నట్టు, విజయమే మన లక్ష్యం అని చెప్పటం పార్టీ శ్రేణులను షాక్ కు గురి చేస్తుంది.












Click it and Unblock the Notifications