సమైక్య రాష్ట్రంలో ఇబ్బందులు: 10 లక్షల చెక్కును అందజేసిన కేటీఆర్(ఫోటోలు)
హైదరాబాద్: గోకుల్ చాట్ బాంబు పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదాశివరెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. పేలుడు ప్రమాదంలో జీవచ్ఛవంలా మారిన యువ ఇంజినీర్ సదాశివారెడ్డికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.10 లక్షల చెక్కును బాధితుడి తల్లిదండ్రులు జీ మోహన్‌రెడ్డి, వసంతకు గురువారం సచివాలయంలోని సీ బ్లాక్‌లోని మంత్రి కేటీఆర్ అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తమకు ఆర్థిక సహాయం అందిందని బాధితుడు సదాశివరెడ్డి తల్లిదండ్రులు అన్నారు. ఎనిమిదేళ్లుగా ఎందరి చుట్టో తిరిగామని, ఎవరూ పట్టించుకోలేదన్నారు. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నామని, ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పరిహారం అందించారని తెలిపారు.

సమైక్య రాష్ర్టానికి సీఎంలుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు అసలు పట్టించుకోలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం గోకుల్‌చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 49 మంది చనిపోగా, దాదాపు 67 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ ఘటనలో సదాశివారెడ్డి తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంలా మారారు. వైద్యఖర్చులకు నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కుటుంబ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని సీఎం తరఫున మంత్రి కేటీఆర్ ఆ కుటుంబానికి చెక్కును అందజేశారు. ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు సదాశివారెడ్డి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications