స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం..!!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల వేళ ప్రజా మద్దతు తమకే ఉందని ధీమాగా చెబుతోంది. బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ తమ సత్తా చాటుతామని అంటోంది. బీసీ రిజర్వేషన్లు... పథకాలు తమకు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా. ప్రభుత్వంపైన వ్యతిరేకత అస్త్రంగా బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలపైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్ణయ తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే.. గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు మేం 'బాకీ కార్డులను' తీసుకువచ్చామని చెప్పారు. ఈ 'బాకీ కార్డుల' ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి, మనిషి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని వివరించారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారన్నారు. మహిళలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్ధుల ఖరారు బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇంఛార్జ్ లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications